ఒక్క బార్‌: 248 దరఖాస్తులు.. 73.78 కోట్ల ఆదాయం

9 Feb, 2021 09:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కొత్త మున్సిపాలిటీల్లో నేరేడుచర్ల టాప్‌..

పాత వాటిలో తొర్రూరు బార్‌కు 278 దరఖాస్తులు

159 బార్లకు 7,378 దరఖాస్తులు

దరఖాస్తులతో రాష్ట్ర ఖజానాకు రూ.73.78 కోట్ల ఆదాయం

రేపు కొత్తబార్లకు లక్కీడ్రా..

ఈ నెల 17న కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: కొత్త మున్సిపాలిటీ సరికొత్త రికార్డు సృష్టించింది. అక్కడ ఏర్పాటు చేయాల్సింది ఏక్‌ బార్‌.. వచ్చినవి ఏకంగా 248 దరఖాస్తులు. రాష్ట్రంలోని 72 కొత్త మున్సిపాలిటీల్లో 159 బార్ల ఏర్పాటుకు గత నెల 25న ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సూర్యాపేట జిల్లాలో కొత్తగా ఏర్పాటైన నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఒక్క లిక్కర్‌ షాపు కోసం 248 దరఖాస్తులు వచ్చాయి. అతిఎక్కువ దరఖాస్తులు వచ్చిన రెండో మున్సిపాలిటీ నేరేడుచర్లనే. మహబూబ్‌బాద్‌ జిల్లా తొర్రూర్‌లో ఒక బార్‌కు 278 దరఖాస్తులు వచ్చాయి. సోమవారం దరఖాస్తు గడువు ముగిసే సమయానికి ఆయా మున్సిపాలిటీల్లో 7,380 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా, దరఖాస్తు రుసుము కింద ప్రభుత్వ ఖజానాకు రూ.73.78 కోట్ల ఆదాయం సమకూరడం గమనార్హం.   

12 చోట్ల మినహా.. 
కొత్త బార్‌ల కోసం మొదట్లో మందకొడిగా దాఖలైన దరఖాస్తులు గడువు సమీపించేకొద్దీ వెల్లువలా వచ్చాయి. మొత్తం 7,378 దరఖాస్తులు వచ్చాయి. 147 షాపులకు 10 కంటే ఎక్కువే దరఖాస్తులు వచ్చాయి. నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో కొత్తగా ఏడు బార్లు నోటిఫై చేయగా 7, బోధన్‌ మున్సిపాలిటీలో 3బార్లు నోటిఫై చేయగా 3 దరఖాస్తులు వచ్చాయి. దుబ్బాకలో ఒక షాపునకు 7, అమరచింతలో ఒక షాపునకు 8 దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 55 షాపులకు 1,074 వరకు దరఖాస్తులు వచ్చాయి. కొత్త మద్యం దుకాణాలకుగాను బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లు డ్రా తీయనున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని షాపులకు ఎక్సైజ్‌ కమిషనర్‌ అదేరోజు డ్రా తీస్తారు. గెలిచినవారికి 17న షాపులు కేటాయించనున్నారు. షాపులు కేటాయించిన మూడు నెలల్లోపు బార్‌ ఏర్పాటుకు ఎక్సైజ్‌ శాఖ సూచించే అన్ని నిబంధనలను యజమానులు పూర్తి చేయాల్సి ఉంటుంది. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో రికార్డు  
సాక్షి, యాదాద్రి: యాదాద్రి–భువనగిరి జిల్లాలోని నూతన మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేయనున్న ఐదు బార్‌లకు 638 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు రూపంలోనే రూ. 6.38 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. చివరి రోజైన సోమవారం 356 దరఖాస్తులు రావడం పోటీ తీవ్రతకు అద్దంపడుతోంది. యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని ఒక బార్‌కు 277 దరఖాస్తులు వచ్చాయి. చౌటుప్పల్‌లోని రెండు బార్‌లకు 135, ఆలేరులోని ఒక బార్‌కు 126, మోత్కూరులోని ఒక బార్‌కు 100 దరఖాస్తులు వచ్చాయి. 

సాక్షి కార్టూన్‌: ఈ అడ్రస్సా.. ఇలా వెళ్లు ఊర్వశీ బార్‌ వస్తుంది..

మరిన్ని వార్తలు