పదేళ్లప్పుడు వెళ్లి..  పాతికేళ్లకు మళ్లీ!

25 Dec, 2020 01:44 IST|Sakshi
తల్లితో రమేష్‌ 

సాక్షి, ఖమ్మం (రఘునాథపాలెం): తండ్రి కొట్టాడని అలిగి పదేళ్లప్పుడు ఇంటి నుంచి పారిపోయాడు. వందల కిలో మీటర్ల దూరం దాటి పక్క రాష్ట్రానికి చేరాడు. పాతికేళ్ల తర్వాత తల్లిని, తండ్రిని చూడాలని తపిం చి తిరిగి వచ్చాడు. కానీ, తండ్రి లేడు. క్షణికావే శంలో దూరం చేసుకున్న తండ్రి ఇక ఎంతకాలానికైనా తిరిగి రాడని తెలిసి తల్లడిల్లిపోతున్నాడు. వివ రాలు... ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపుడి గ్రామానికి చెందిన దొంతు నాగమణి, సత్యనారాయణ అనే రైతు దంపతులు 25 ఏళ్ల క్రితం ఓ గుర్తు తెలియని పదేళ్ల అబ్బాయిని చేరదీశారు. రమేశ్‌ అని పేరు పెట్టారు. పెద్దయ్యాక అదే మండలం మల్లేపల్లికి చెందిన లక్ష్మి అనే యువతితో పెళ్లి చేశారు. రమేశ్‌ దంపతులకిప్పుడు ఒక కొడుకు, కుమార్తె ఉన్నారు. మల్లేపల్లి సమీపంలోని యాకూబ్‌ కాలనీలో ఉంటూ చిన్న ఇల్లు కట్టుకున్నాడు.

జన్మస్థలం గురించి ఆరా తీసి..: రమేశ్‌ ఇప్పుడు ఖమ్మంలోని ఓ గ్రానైట్‌ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఫ్యాక్టరీ యజమాని భార్య, కుమారుడికి రమేశ్‌ తన చిన్నప్పటి సంగతులను అప్పుడప్పుడు చెబుతుండేవాడు. తన తల్లిదండ్రులు, మూర్తి, మున్నెమ్మ, అన్న కార్తీక్, తమ్ముడు ప్రభు, చెల్లి నయాని ఎలా ఉన్నారోనని బెంగటిల్లెవాడు. దీంతో కంపెనీ యజమాని కొడుకు అతడి జన్మస్థలం గురించి ఆరా తీశాడు. రమేశ్‌ తెలిపిన వివరాల మేరకు కంపెనీ యజమాని కొడుకు తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా అంబూరి మండలం కదవాల గ్రామంలో విచారణ చేయించాడు.

ఆ గ్రామ రేషన్‌ దుకాణంలో ఉన్న జాబితా ద్వారా చిన్నప్పటి ఫొటోను.. ఇప్పటి రమేష్‌ ఫొటోను సరిచూశాడు. తమ కుమారుడు పదేళ్ల వయసులో ఇంటి నుంచి పారిపోయాడని, ఆ ఫొటోలో ఉన్నది తమవాడేనని తల్లి, సోదరులు నిర్ధారించారు. గత ఆదివారం తమిళనాడులోని తన జన్మస్థలానికి వెళ్లాడు. తల్లిని, చెల్లిని, ఇద్దరు సోదరులను కలుసుకున్నాడు. తండ్రి రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందాడని తెలుసుకొని చలించిపోయాడు. తల్లిని, చెల్లిని, బావను, చెల్లి పిల్లలను తనతోపాటు యాకూబ్‌నగర్‌ తీసుకొచ్చాడు. అయితే, అతడు తెలుగు మాత్రమే మాట్లాడటం.. తల్లి, చెల్లి, బావలకు తమిళం తప్ప తెలుగు భాష రాకపోవడంతో వారితో రమేశ్‌ సైగలు చేస్తూ వ్యవహరిస్తున్నాడు. 

>
మరిన్ని వార్తలు