సొంత గూటికి అరుదైన తాబేళ్లు

20 Sep, 2021 03:09 IST|Sakshi

విమానంలో హైదరాబాద్‌ నుంచి లక్నోకు తరలింపు

సాక్షి, హైదరాబాద్‌: అక్రమ రవాణాలో పట్టుబడిన 266 అరుదైన తాబేళ్లు సొంత గూటికి చేరాయి. ఆదివారం హైదరాబాద్‌ నుంచి ఎయిర్‌ ఇండియా విమానంలో ఉత్తరప్రదేశ్‌లోని లక్నోకు ఈ ఇండియన్‌ టెంట్‌ టర్టిల్‌ (పంగ్‌శుర టెంటోరియా సర్కమ్‌ డాటా), ఇండియన్‌ రూటెడ్‌ టర్టిల్‌ (పంగ్‌శుర టెక్టా)గా పిలిచే తాబేళ్లను సురక్షితంగా పంపించారు. గత ఆగస్టులో లక్నో సమీపంలోని గోమతి నది నుంచి తాబేళ్లను అక్రమంగా తెచ్చి హైదరాబాద్‌లో అమ్ముతుండగా ఇద్దరు నేరగాళ్లను పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం ఈ తాబేళ్లను జూపార్కుకు తరలించారు. అయితే సహజ సిద్ధఆవాసాల్లో ఎక్కువ సంరక్షణ ఉంటుంది కాబట్టి తాబేళ్లను లక్నోకు తరలించే విషయమై  తెలంగాణ అటవీ శాఖను యూపీ పీసీసీఎఫ్‌ (వైల్డ్‌లైఫ్‌) పవన్‌కుమార్‌ శర్మ సంప్రదించారు. దీంతో వాటికి ఆరోగ్య పరీక్షలు చేసి సురక్షిత ప్యాకేజింగ్‌తో ఎయిర్‌ ఇండియా విమానంలో లక్నో పంపించారు. అక్కడ కూడా పరీక్షలు నిర్వహించి గోమతి నదిలో వదిలేస్తామని యూపీ అధికారులు తెలిపారు.

అరుదైన తాబేళ్లు కావడంతో అక్రమ రవాణా బారిన పడుతున్నాయని, వాటి పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉందని టీఎస్‌ఏ(టర్టిల్‌ సర్వైవల్‌ అలయన్స్‌) ఇండియా డైరెక్టర్‌ డా.శైలేంద్ర సింగ్‌ అభిప్రాయపడ్డారు. అక్రమ రవాణాను అడ్డుకుని పట్టుకున్న తాబేళ్లను మళ్లీ సహజసిద్ధ ఆవాసాలకు తిప్పి పంపడం ఇది రెండోసారి. 2015లో మహారాష్ట్రలోని పుణె నుంచి 500 తాబేళ్లను లక్నోకు తరలించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌ఏ బృందం ఇమ్రాన్‌ సిద్దిఖీ, సుజిత్, లక్నో సబ్‌డివిజనల్‌ ఆఫీసర్‌ అలోక్‌పాండే, బయోలాజిస్ట్‌ అరుణిమ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు