వైరా గురుకులంలో కరోనా కలకలం.. 29 మంది విద్యార్థులకు కరోనా

22 Nov, 2021 10:52 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: వైరా: ఖమ్మం జిల్లా వైరాలోని టీఎస్‌ గురుకుల బాలికల పాఠశాలలో రెండ్రోజుల వ్యవధిలో 29 మంది విద్యార్థినులు కోవిడ్‌ బారినపడ్డారు. మొదట గత నెల 30న 8వ తరగతి విద్యార్థిని శుభకార్యం నిమిత్తం ఇంటికి వెళ్లి, తిరిగి ఈనెల 15న దగ్గు, జలుబుతో బాధపడుతూనే పాఠశాలకు వచ్చింది. కరోనా పరీక్ష చేయించుకుని రావాలని ప్రిన్సిపాల్‌ బాలికను ఇంటికి పంపించారు. అక్కడ పరీక్ష చేయగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఆమె పక్కన కూర్చునే మరో విద్యార్థినికి సైతం లక్షణాలు కనిపించడంతో తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వారు బాలికకు వైరాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్ష చేయించగా, పాజిటివ్‌గా నిర్ధారణైంది.
చదవండి: టీఆర్‌ఎస్‌ నుంచి ఇద్దరి పేర్లు ఖరారు.. సీఎం నిర్ణయమే ఫైనల్‌..

దీంతో వైరా ఆస్పత్రి వైద్యురాలు సుచరిత ఆధ్వర్యంలో శనివారం గురుకుల పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేసి పరీక్షలు చేయగా 13 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారందరినీ ఇంటికి పంపించారు. ఆదివారం మళ్లీ పరీక్షలు చేయగా మరో 16 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. జిల్లా అధికారులకు సమాచారం అందించి మున్సిపల్‌ సిబ్బందితో పాఠశాలను శానిటైజ్‌ చేయించారు. జిల్లా కోవిడ్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ రాజేశ్‌ పాఠశాలను పరిశీలించారు. మరో 15 మంది బాలికలకు అనుమానిత లక్షణాలు ఉండడంతో ఆర్టీపీసీఆర్‌ టెస్టులు నిర్వహించి శాంపిల్స్‌ను ఖమ్మం పంపారు.   
చదవండి: తెలంగాణ వైద్యారోగ్యశాఖ కీలక ఉత్తర్వులు..

మరిన్ని వార్తలు