సూర్యాపేటలో ఏకంగా 28 మందికి పాజిటివ్‌ 

1 Jan, 2021 17:17 IST|Sakshi

సాక్షి, సూర్యాపేట: ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లి ఏకంగా 28 మంది కరోనా బారిన పడ్డారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగుచూసిన ఈ ఘటన శుక్రవారం కలకలం సృష్టించింది. సూర్యాపేటలోని యాదాద్రి టౌన్‌షిప్‌లో నివాసముంటున్న ఓ వ్యక్తి (63) అనారోగ్యంతో గత నెల 24న మృతిచెందారు. ఆయన అంత్యక్రియలకు టౌన్‌షిప్‌లో ఉంటున్న కుటుంబసభ్యులతోపాటు మోతె, హైదరాబాద్, నల్లగొండ, యర్కా రం గ్రామాలకు చెందిన బంధువులు హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం కొంత మంది తమ ఇళ్లకు వెళ్లిపోగా.. కుటుంబ సభ్యులు, సమీప బంధువులు మాత్రం కర్మకాండలు ముగిసే వరకు అక్కడ రెండిళ్లలో ఉండిపోయా రు.

ఈ క్రమంలో క్షయ వ్యాధి ఉన్న సమీప బంధువు ఒకరు అలసటకు గురి కావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనకు వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా..పాజిటివ్‌గా నిర్దారణ అయింది. దీంతో తనతోపాటు అంత్యక్రియల్లో పాల్గొన్నవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రెండిళ్లలో ఉంటున్న 35 మంది జనరల్‌ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా 22 మందికి పాజిటివ్‌ అని తేలింది. చిన్న కర్మ కాండలకు వచ్చి ఇళ్లకు వెళ్లిపోయిన మరికొంతమంది తమ స్వస్థలాల్లో పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 

డిసెంబర్‌ 31నే తేలింది.. 
వీరందరికీ డిసెంబర్‌ 31నే పాజిటివ్‌ అని తేలినా సమాచారం ఎక్కడా బయటకు రాలేదు. గురువారం నుంచి అంతా హోం క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ కాలనీకి చెందిన ఓ పార్టీ నేత రెండు కుటుంబాలకు పాజిటివ్‌ వచ్చిందని, ఆ ప్రాంతంలో శానిటైజేషన్‌ చేయించాలని మున్సిపల్‌ అధికారులకు ఫోన్‌ చేసి చెప్పినట్లు తెలిసింది.  ఒకేసారి ఇంత మందికి కరోనా రావడంతో మున్సిపల్‌ అధికారులు యుద్ధప్రాతిపదికన అక్కడ శానిటైజేషన్‌ చేయించారు. అనంతరం ఈ విషయాన్ని వైద్యాధికారులతో పాటు జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి ఇంటిని సర్వే చేసి..ఎవరికైనా లక్షణాలుంటే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

జిల్లాలో సామాజిక వ్యాప్తి లేదు.. 
యాదాద్రి టౌన్‌షిప్‌లో 22 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వారంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడు మందులు అందించడంతోపాటు తగు జాగ్రత్తలు చెబుతున్నారు. అంత్యక్రియలు, చిన్నకర్మ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు ఒకేచోట ఎక్కువ మంది చేరడంతో వైరస్‌ వ్యాప్తి చెందిందని గుర్తించాం. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. జిల్లాలో వైరస్‌ సామాజిక వ్యాప్తి లేదు. – డాక్టర్‌ కర్పూరం హర్షవర్ధన్, జిల్లా వైద్యాధికారి 

మరిన్ని వార్తలు