Black Fungus: కోఠి ఆస్పత్రికి ఒక్కరోజే 284 మంది!

21 May, 2021 04:23 IST|Sakshi
చికిత్స కోసం కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వచ్చిన బ్లాక్‌ ఫంగస్‌ రోగులు

పెరుగుతున్న ‘బ్లాక్‌ ఫంగస్‌’ బాధితులు

ఈఎన్‌టీ ఆస్పత్రిలో గురువారం 39 మంది అడ్మిట్‌

పాజిటివ్‌ బాధితులు, కోవిడ్‌ నెగెటివ్‌ రిపోర్టు లేనివారు వెనక్కి..

మరికొందరు పలు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి రెఫర్‌

స్వల్ప లక్షణాలు ఉన్నవారికి మందులు

90కి చేరిన ఇన్‌పేషెంట్ల సంఖ్య.. ఏడుగురికి ఆపరేషన్లు

సాక్షి, సుల్తాన్‌బజార్‌: ‘బ్లాక్‌ ఫంగస్‌’ నోడల్‌ కేంద్రమైన హైదరాబాద్‌లోని కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రికి వస్తున్న బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. గురువారం ఒక్కరోజే 284 మంది బ్లాక్‌ ఫంగస్‌ అనుమానితులు ఆస్పత్రికి రాగా.. అందులో మొత్తం 39 మందిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ చేసుకున్నారు. మిగతావారిలోనూ చాలా మందికి బ్లాక్‌ ఫంగస్‌ లక్షణాలు ఉన్నా.. కొందరు పాజిటివ్‌ రోగులు కావడం, మరికొందరికి కోవిడ్‌ వచ్చి తగ్గినా ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ లేకపోవడంతో చేర్చుకోలేదని సమాచారం. చాలా తక్కువగా లక్షణాలు ఉన్నవారికి మందులు రాసి పంపించినట్టు తెలిసింది. తాజాగా అడ్మిట్‌ అయినవారితో కలిపి ప్రస్తుతం ఈఎన్‌టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ‘బ్లాక్‌ ఫంగస్‌’ బాధితుల సంఖ్య 90కి చేరింది. వీరిలో ఏడుగురికి గురువారం శస్త్రచికిత్సలు నిర్వహించారు.


బెడ్ల సంఖ్య పెంచుతూ..
ఈఎన్‌టీ ఆస్పత్రికి వస్తున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్ల సంఖ్యను పెంచుకుంటూ వెళ్తున్నారు. మొదట 50 బెడ్లను కేటాయించగా.. ప్రస్తుతం 200 వరకు బెడ్లను సిద్ధం చేస్తున్నట్టు ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా వార్డుల్లో, ఆవరణలో బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు.


పరీక్షలు, రిపోర్టుల కోసం వెనక్కి..
గురువారం ఒక్కసారిగా 284 మంది ‘బ్లాక్‌ ఫంగస్‌’ అనుమానితులు ఈఎన్‌టీ ఆస్పత్రికి రావడంతో ఆవరణ అంతా కిక్కిరిసిపోయింది. వీరిలో కొందరు కోవిడ్‌ పాజిటివ్‌ వారు ఉండటం, మరికొందరికి కోవిడ్‌ తగ్గినా ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ లేకపోవడంతో వారిని ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిప్పిపంపారు. మరికొందరిని పలు టెస్టుల కోసం ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లాలని ఈఎన్‌టీ ఆస్పత్రి వైద్యులు సూచించినట్టు రోగులు తెలిపారు. ఉస్మానియాకు, ఇతర ల్యాబ్‌లకు టెస్టుల కోసం పరుగెత్తడం, ఇందుకు రోజంతా సమయం పట్టడంతో ఆస్పత్రిలో అడ్మిషన్‌ ఆలస్యం అవుతోందని రోగుల బంధువులు వాపోయారు. ఉదయం ముందుగా వస్తున్న రోగులకు పరీక్షలు చేస్తున్నామని, పెద్ద సంఖ్యలో వస్తుండటంతో అందరికీ పరీక్షలు చేయలేని పరిస్థితి ఉందని ఆస్పత్రి వర్గాలు చెప్తున్నాయి. దీంతో అడ్మిషన్ల కోసం వచ్చిన రోగులు ఆస్పత్రి ఆవరణలో వేచి ఉండటం కనిపించింది.


ఆస్పత్రిని పరిశీలించిన సీఎంవో ఓఎస్డీ
బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలకు సంబంధించి కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిని సీఎంవో ఓఎస్డీ గంగాధర్‌ గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో ఉన్న బెడ్లు, పేషెంట్ల సంఖ్య, చికిత్సలపై ఆరా తీశారు. అంతకుముందు ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బందితో సమావేశమయ్యారు. ఆస్పత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన వారికి చికిత్సలో ఆక్సిజన్‌ అవసరం ఎక్కువగా ఉండదని ఆయన పేర్కొన్నారు.

జిల్లాల్లో బ్లాక్‌ ఫంగస్‌ కలకలం
సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం కూడా పెద్దసంఖ్యలో నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌ (ఎస్‌) మండల పరిధిలోని కందగట్లకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు.. కరోనా నుంచి కోలుకున్నాక బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారు. ఆయన కోఠి ఈఎన్‌టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక నాగర్‌కర్నూల్‌ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లికి చెందిన 25 ఏళ్ల యువకుడు, రంగాపూర్‌కు చెందిన మరో వ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌ బారినపడ్డారు. ఈ ఇద్దరికి కళ్లకు ఇన్ఫెక్షన్‌ సోకగా.. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు నిర్వహించారు. వీరిలో 25 ఏళ్ల యువకుడికి ఒక కన్ను తొలగించినట్టు బాధితుడి బంధువులు తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ నియోజకవర్గం అర్లి(టి)కి చెందిన 46 ఏళ్ల వ్యక్తి బ్లాక్‌ ఫంగస్‌తో ఈఎన్‌టీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు