2-డీజీ సాచెట్‌ ధర ప్రకటించిన రెడ్డీస్‌ ల్యాబ్స్‌

28 May, 2021 13:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డీఆర్‌డీవో రూపొందించిన 2-డీజీ సాచెట్‌ ధరను రెడ్డీస్‌ ల్యాబ్స్‌ ప్రకటించింది. కరోనా చికిత్సలో 2-డీజీ సాచెట్‌ అద్భుతంగా పని చేస్తుందన్ని డీఆర్‌డీవో తెలిపింది. ఒక్కో 2డీజీ సాచెట్‌ ధర రూ.990గా రెడ్డీస్‌ ల్యాబ్స్‌ నిర్ణయించింది. చికిత్సలో ఒక్కొక్కరికి ఐదు నుంచి పది సాచెట్‌లు అవసరం. చికిత్సకు ఒక్కో వ్యక్తికి రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చవుతుంది.

కరోనా బారినపడ్డ వారు వేగంగా కోలుకునేందుకు, ఆక్సిజన్‌ పెట్టాల్సిన అవసరాన్ని తగ్గించేందుకు తోడ్పడే ‘2–డీజీ (2 డీఆక్సి–డీ గ్లూకోజ్‌)’ ఔషధాన్నిడాక్టర్‌ రెడ్డీస్‌ గురువారం మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి విదితమే. ముందుగా 10వేల సాచెట్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు పేర్కొంది. 2-డీజీ ఔషధాన్ని డీఆర్డీవో, డాక్టర్ రెడ్డీస్ సంయుక్తంగా తయారు చేసిన విషయం తెలిసిందే. 2–డీజీ మందు.. పొడి రూపంలో లభిస్తుంది. దానిని నీటిలో కరిగించుకుని తాగాలి. ఈ ఔషధం మన శరీరంలో వైరస్‌ సోకిన కణాల్లోకి చేరుకుని.. ఆ కణాల నుంచి వైరస్‌లు శక్తి పొందకుండా నిరోధిస్తుంది. దీంతో వైరస్‌ వృద్ధి తగ్గిపోతుంది. వైరస్‌తో కూడిన కణాల్లోకే చేరుకోవడం 2–డీజీ ప్రత్యేకత.

చదవండి: భారత్‌: మరోసారి 2 లక్షలకు దిగువన కరోనా కేసులు
Corona Vaccine: మిక్స్‌ చేస్తే పర్లేదా!

మరిన్ని వార్తలు