నో షేవింగ్‌.. 3,500 కోట్లు సేవింగ్‌

27 Nov, 2021 03:52 IST|Sakshi

జుట్టు కత్తిరించుకోకుండా, గడ్డం గీసుకోకుండా ప్రొస్టేట్‌ కేన్సర్‌పై పలువురి వినూత్న ప్రచారం 

మహిళలూ బ్యూటీ పార్లర్లకు వెళ్లరు  

ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏటా రూ.3,500 కోట్లు సేకరణ 

కేన్సర్‌ టెస్టులు, అవగాహనకు ఆ డబ్బు ఖర్చు  

ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు చేరిన ఉద్యమం 

సాక్షి, హైదరాబాద్‌: వీరంతా కాంటినెంటల్‌ ఆసుపత్రి వైద్యులు. సహజంగా వైద్యులు ప్రతీరోజూ గడ్డాలు తీసి మీసాలు ట్రిమ్‌ చేసుకొని ఫ్రెష్‌గా కనిపిస్తారు. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న డాక్టర్లు గడ్డాలు, మీసాలు పెంచుకొని ఉండటం గమనించారా? సమయం లేకపోవడం వల్ల ఇలా పెంచుకోలేదు. ప్రొస్టేట్‌ కేన్సర్‌పై అవగాహన కోసం ఇలా ఈ నెలంతా ఇలా పెంచారు. అలాగే మహిళా వైద్యులు, సిబ్బంది బ్యూటీపార్లర్లకు ఈ నెలంతా వెళ్లలేదు.

ఇలా హైదరాబాద్‌లో పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది, కేన్సర్‌ రోగులు, వారి బంధువులు వందలాది మందికి వ్యాధిపై అవగాహన కోసం ప్రత్యేకంగా నవంబర్‌ను ‘మవంబర్‌’ నెలగా పాటిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నవంబర్‌ను ప్రొస్టేట్‌ కేన్సర్‌పై అవగాహన నెలగా పాటిస్తోంది.

ఆస్ట్రేలియాలో మొదలైన ఉద్యమం...
పురుషుల్లో కొందరికి 60–70 ఏళ్ల తర్వాత ప్రొస్టేట్‌ కేన్సర్‌ వస్తుంది. సహజంగా మగవారిలో కేన్సర్‌పై అవగాహన తక్కువ. ఆ పరిస్థితిని మార్చడం కోసం ఆస్ట్రేలియాలో 2దశాబ్దాల క్రితం ఒక ఉద్యమం మొదలైంది. నవంబర్‌లో గడ్డం, మీసాలు, జుట్లు పెంచి ప్రజల్లో వినూత్నంగా కనిపిస్తూ కేన్సర్‌పై అవగాహన పెంచేవారు. సెలూన్‌కు వెళ్లకుండా మిగిలిన డబ్బును కేన్సర్‌ రోగులకు సాయం చేయడం, స్క్రీనింగ్‌ టెస్టులు చేయించడం, అవగాహన కార్యక్రమాలకు వెచ్చించేవారు.

మహిళా డాక్టర్లు, సిబ్బంది తదితరులు కూడా బ్యూటీపార్లర్లకు వెళ్లడం ఆపేశారు. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో 15 లక్షల మంది వైద్యులు, వైద్య సిబ్బంది, కేన్సర్‌ రోగులు, వారి బంధువులు, స్నేహితులు ఇలాగే చేస్తున్నారు. ఇలా ఏడాదికి రూ.3,500 కోట్లు మిగుల్చుతున్నారు. ఐదేళ్ల నుంచి ఈ ఉద్యమం మన దేశంలోనూ మొదలైంది. ఢిల్లీ, హైదరాబాద్‌ కాంటినెంటల్‌ ఆసుపత్రిలోనూ, సీసీ ఫౌండేషన్‌ సిబ్బంది దీన్ని పాటిస్తున్నారు.

ఒక్క హైదరాబాద్‌లోనే వేయి మంది డాక్టర్లు ఈ నెలంతా గడ్డం, మీసాలు, జుట్టు పెంచుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 10 వేల నుంచి 15 వేల మంది వరకు ఈ విధానాన్ని పాటిస్తున్నారని అంచనా. నవంబర్‌ గడిచాక పొదుపు చేసిన సొమ్మును సంబంధిత చారిటబుల్‌ ట్రస్టుకు అందజేస్తారు.

ఐదేళ్లుగా పాటిస్తున్నా.. 
ఐదేళ్లుగా నవంబర్‌లో ఈ విధానాన్ని పాటిస్తున్నా. తెలుగు రాష్ట్రాల్లో ఇలా చేయడం ద్వారా మిగిలిన లక్షల రూపాయలను ప్రొస్టేట్‌ కేన్సర్‌పై అవగాహనకు ఖర్చు చేస్తున్నాం. ఈ ఏడాది రెండు లేబొరేటరీలు రూ.100కే పీఎస్‌ఏ టెస్టులు చేయడానికి ముందుకొచ్చాయి. ప్రస్తుతం కాంటినెంటల్‌ ఆసుపత్రిలో 90 మందిమి ఈ ఉద్యమం చేస్తున్నాం. ఇందులో పురుషులు, మహిళలు ఉన్నారు.
– డాక్టర్‌ ఎ.వి.సురేష్, సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్, కాంటినెంటల్‌ ఆసుపత్రి 

మరిన్ని వార్తలు