రాష్ట్రంలో వ్యవసాయ ట్రాక్టర్లు 3.52 లక్షలు 

15 Nov, 2022 02:44 IST|Sakshi

ఈ ఎనిమిదేళ్లలో మూడున్నర రెట్లు పెరుగుదల వ్యవసాయ శాఖ నివేదిక వెల్లడి.. పురోగతిలో తెలంగాణ ’సాగు’ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం ఇప్పటివరకు రూ.963.26 కోట్లు ఖర్చు చేసింది. దీంతో వివిధ రకాల వ్యవసాయ యంత్రాల సంఖ్య పెరిగింది. 2014–15లో తెలంగాణలో వ్యవసాయ ట్రాక్టర్ల సంఖ్య 94,537 ఉండగా, ప్రస్తుతం 3.52 లక్షలకు పెరిగాయి. 2014–15లో 6,318 వరి కోత యంత్రాలు ఉండగా, అవి ప్రస్తుతం 19,309కు చేరా యని వ్యవసాయశాఖ వెల్లడించింది.

వ్యవసాయ రంగంలో జరిగిన అభివృద్ధిపై ఒక నివేదికను విడుదల చేసింది. 2014–15లో గోదాముల సామర్థ్యం 39 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 68.28 లక్షలకు పెరిగింది. రైతు సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషితో 2014 నాటికి సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాలుంటే, అదిప్పుడు 2.03 కోట్ల ఎకరాలకు పెరిగింది. అలాగే 11.50 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం పెరిగింది.

2014–15 నాటికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు మాత్రమే ఉంటే, 2021–22 నాటికి 2.49 కోట్ల టన్నులకు చేరింది. అన్ని పంటల ఉత్పత్తి కలిపి 3.50 కోట్ల టన్నులకు చేరుకుంది. 2014–15లో పత్తి సాగు విస్తీర్ణం 41.83 లక్షల ఎకరాలు ఉండగా, 2020–21 నాటికి 60.53 లక్షల ఎకరాలకు చేరుకుంది. 2014–15లో పత్తి దిగుబడి 35.83 లక్షల బేళ్లు ఉండగా, ఇప్పుడు 60.44 లక్షల బేళ్లకు చేరుకుంది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.1,07,748 కోట్ల విలువైన 6.06 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది.

పంటలకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్‌ సరఫరాకు రూ. 36,703 కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు 9 విడతల్లో రూ. 57,881 కోట్లను రైతుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రైతుబీమా కింద ఇప్పటివరకు 88,963 మంది రైతు కుటుంబాలకు5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్రంలోని ప్రజల తలసరి ఆదాయం 2014–15లో రూ.1,12,162 ఉండగా, 2021–22 నాటికి రూ.2,78,833లకు పెరిగింది. వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి కూడా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరుగుదలకు దోహదం చేసిందని ఆ శాఖ పేర్కొంది.   

మరిన్ని వార్తలు