‘సర్కారు భూమిల మన్నుబొయ్య..’

12 Dec, 2020 15:33 IST|Sakshi

3 ఎకరాల చిచ్చు, రణరంగమైన గ్రామం

బొమ్మకల్‌ గ్రామ దళితుల మధ్య చిచ్చు!

సాక్షి, మహబూబాబాద్‌: దళితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న మూడెకరాల భూమి ఓ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. దళితుల మధ్య చిచ్చు రేపింది. ఈ ఘటన బొమ్మకల్ గ్రామంలో జరిగింది. గతంలో ఈ గ్రామంలోని 20 మంది దళితులకు 3 ఎకరాల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది. 20 మందికి పంపిణీ చేసిన మూడు ఎకరాల భూమిని గ్రామ సర్పంచ్‌ ఒప్పందంతో అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి ఎకరం చొప్పున పంచుకోవాలని గతంలో దళితులంతా ఒప్పందం చేసుకున్నారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మూడు ఎకరాల భూమిని 20 మందికి మాత్రమే వర్తిస్తుందని లబ్ధిదారులు అనడంతో దళితులంతా ఆగ్రహించారు.

మహిళలని కూడా చూడకుండా లబ్దిదారులపై విచక్షణరహితంగా దాడికి దిగారు. తీవ్ర గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దవంగర ఎస్‌ఐ జితేందర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దళితులంతా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు సమర్పించారని ఎస్‌ఐ తెలిపారు. ఇక గ్రామంలోని కొంతమంది దళితులకే ప్రభుత్వం భూములు ఇవ్వడంతోనే ఈ గొడవలకు కారణమైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘సర్కారు భూమిల మన్నుబొయ్య మా పానాలు తీస్తరా’ అని బాధితులు ఆక్రోశం వెళ్లగక్కారు.

>
మరిన్ని వార్తలు