మూడు అడుగులే.. అయినా నేనేం తక్కువ..? 

9 Jan, 2021 12:50 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: ‘కటౌట్‌ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్‌’ అని ప్రభాస్‌ ఓ సినిమాలో అంటే అందరూ చూశారు.. కానీ మూడు అడుగులు ఉన్న శివలాల్‌ కూడా ఇదే డైలాగ్‌ కొడితే అందరూ ఫక్కున నవ్వేశారు.. కానీ ఇప్పుడు శివలాల్‌ను చూసిన ప్రతిఒక్కరూ ముక్కున వేలేసుకుంటున్నారు.. నువ్వు పొట్టోడివి.. నీకు కారు నడపడం చేతనవుతుందా.. నువ్వు తినడానికి తప్పితే ఎందుకూ పనికిరావంటూ బంధుమిత్రులు, సన్నిహితులు, చుట్టుపక్కల వారు చేసిన హేళన మరుగుజ్జు గట్టిపల్లి శివలాల్‌ (38)పై తీవ్రమైన ప్రభావం చూపింది. ఆరు అడుగుల పొడవుంటేనే కారు నడపవచ్చా..? మూడడుగులు ఉంటే నడపరాదా అనే ప్రశ్నను తనుకు తానే వేసుకొని నూతన సంవత్సరంలో ఓ గట్టి ఛాలెంజ్‌ను తనకు తానే తీసుకున్నాడు. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 10లోని ఉదయ్‌ నగర్‌లో నివసించే జి.శివలాల్‌ పుట్టుకతోనే మరుగుజ్జు. మూడు అడుగుల పొడవు. 

అయితేనేం ఆత్మవిశ్వాసంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 400 మంది మరుగుజ్జుల్లో డిగ్రీ చేసిన మొదటి వికలాంగుడు. అంతేకాదు టైప్‌ రైటింగ్‌లో హయ్యర్‌ గ్రేడ్‌లో డివిజన్‌ ఫస్ట్‌ వచ్చాడు. కంప్యూటర్‌లో పీజీ డీసీఏ చేయడమే కాదు బీకాం కూడా చదివాడు. ప్రస్తుతం ఓ చిన్న జాబ్‌ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న శివలాల్‌కు కారు నేర్చుకోవాలనే ఆసక్తి ఏర్పడింది. తానెందుకు కారు నడపకూడదని అనుకోవడమే కాకుండా తన స్నేహితుడి కారు తీసుకొని దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని కారు నేర్చుకున్నాడు. తనకు తానే దిక్సూచిగా మార్చుకున్నాడు. ఆత్మవిశ్వాసం ముందు వైకల్యం అడ్డురాదని నిరూపించాడు. ప్రస్తుతం 90 శాతం డ్రైవింగ్‌ నేర్చుకోవడం పూర్తయిందని ఈ వారంలో డ్రైవింగ్‌ లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకుంటున్నానని వెల్లడించాడు. డ్రైవర్‌గా ఉండటానికి తాను డ్రైవింగ్‌ నేర్చుకోవడం లేదని భార్య, పిల్లలతో ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే మాత్రమే కారు నడుపుతానని శివలాల్‌ అంటున్నాడు.  

మరిన్ని వార్తలు