గురుకులం ఉపాధ్యాయులకు కరోనా, ఆందోళనలో ఎమ్మెల్యే..

5 Mar, 2021 09:01 IST|Sakshi

మైనారిటీ గురుకులంలో కరోనా కలకలం 

ఇటీవల బడిలో సమావేశమైన ఎమ్మెల్యే ఆనంద్‌  

ఆందోళనకు గురవుతున్న ఆయన అనుచరులు

సాక్షి, వికారాబాద్‌: మైనారిటీ గురుకుల బాలుర పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ సోకింది. ఈమేరకు వైద్యాధికారులు నిర్ధారించారు. జిల్లా కేంద్రంలోని శివారెడ్డి సమీపంలో ఉన్న పాఠశాలలో టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది మొత్తం 40 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ సోకింది. విద్యార్థుల్లోనూ కొందరికి వైరస్‌ లక్షణాలు ఉన్నాయని వైద్యాధికారులు అనుమానిస్తున్నారు. పాఠశాలలో మొత్తం 100 మందికి పైగా 8, 9, 10తోపాటు ఇంటర్‌ చదువుతున్నారు. వైద్యాధికారులు వారినుంచి నమూనాలు సేకరించి గురువారం ల్యాబ్‌కు తరలించారు.

విద్యార్థుల్లో కొందరు జ్వరం తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్యాధికారులు గుర్తించారు. ఫలితాల అనంతరమే నిర్ధారణ అవుతుందని చెబుతున్నారు. పాఠశాలలో మహమ్మారి వ్యాప్తి చెందడానికి కారణమైన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాలలో ముగ్గురికి కోవిడ్‌ పాజిటివ్‌ రావడంతో బడిలో కోవిడ్‌ నిబంధనలు పాటి స్తున్నారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ పిల్లలకు వైరస్‌ సోకితే ఎవరు బాధ్య త వహిస్తారని ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కరోనా భయంతో అటు ఉపాధ్యాయులు ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.  

ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే  
బుధవారం వికారాబాద్‌ ఎమ్మెల్యే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో శివరెడ్డిపేట్‌ సమీపంలో ఉన్న గురుకుల మైనారిటీ స్కూల్‌లో తన అనుచరులతో ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థి వాణీదేవికి ఓటేయాలని ఉపాధ్యాయులను కోరారు. ఎమ్మెల్యే సుమారు గంటసేపు పాఠశాలలో సమవేశమయ్యారు. పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులకు పాజిటివ్‌ రావడంతో అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు సైతం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారులు భావిస్తున్నట్లు సమాచారం.  

మరిన్ని వార్తలు