తూచ్‌..అది ప్రతిపాదనే! 

24 Sep, 2020 04:16 IST|Sakshi

ఇంటర్‌లో 30 శాతం సిలబస్‌కుదిస్తున్నట్లు ప్రకటన 

తెల్లవారే వెనక్కి తగ్గినఇంటర్‌ బోర్డు.. అది ప్రతిపాదన మాత్రమేనని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ సిలబస్‌ తగ్గింపుపై ఇంటర్‌ బోర్డు వెనక్కి తగ్గింది. సిలబస్‌ కుదింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిన మాట వాస్తవమేనని, అయితే దానిపై కాంపిటెంట్‌ అథారిటీ నిర్ణయం ఇంకా తీసుకోలేదని బుధవారం బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ వెల్లడించారు. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌ పని దినాలు నష్టపోయినందున వాటిని సర్దుబాటు చేసేందుకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ను కుదిస్తున్నట్లు మంగళవారం రాత్రి ప్రకటించిన ఇంటర్‌ బోర్డు.. తెల్లవారే అది ప్రతిపాదన మాత్రమేనని చెప్పడం కొంత గందరగోళానికి దారితీసింది. బోర్డు అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ లోపమే దీనికి కారణమని తెలుస్తోంది. బోర్డు కార్యదర్శి ఆమోదం లేకుండానే పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) సంతకంతో సిలబస్‌ కుదింపు ప్రకటనతోపాటు, సబ్జెక్టుల వారీగా సిలబస్‌ విడుదల అయింది. బుధవారం మాత్రం కాంపిటెంట్‌ అథారిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదనిబోర్డు కార్యదర్శి పేర్కొన్నారు.  

ప్రముఖుల పాఠాలు తొలగించం... 
నిబంధనల ప్రకారం.. ఇంటర్‌ బోర్డులో కాంపిటెంట్‌ అథారిటీ అంటే బోర్డు కార్యదర్శే. లేదంటే ప్రభుత్వం. అంటే బోర్డులో కీలకమైన కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ కార్యదర్శి ఆమోదం లేకుండానే సిలబస్‌ను విడుదల చేశారా.. అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. కరోనా కారణంగా నష్టపోయిన పని దినాలను సర్దుబాటు చేసేందుకు సీబీఎస్‌ఈ కుదించిన 30 శాతం సిలబస్‌కు అనుగుణంగా.. రాష్ట్రంలోనూ సిలబస్‌ తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని బోర్డు కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై వెంటనే సిలబస్‌ కమిటీలను ఏర్పాటు చేశామని.. వారు కూడా ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో 30 శాతం సిలబస్‌ కుదింపునకు సిఫారసు చేశారన్నారు. అదీ ఈ ఒక్క సంవత్సరం కోసమేనని పేర్కొన్నారు. అయితే.. దీనిపై కాంపిటెంట్‌ అథారిటీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ప్రతిపాదన దశలోనే ఉందని, త్వరలోనే నిర్ణయాన్ని వెల్లడిస్తామని తెలిపారు. అలాగే హ్యుమానిటీస్‌ సిలబస్‌లో జాతి నేతలు, సంఘ సంస్కర్తలు, ప్రముఖుల పాఠాలను తొలగించే ప్రశ్నే లేదని చెప్పారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు