‘యాదాద్రి’లో.. కరోనా కలకలం!

28 Mar, 2021 18:23 IST|Sakshi

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు

శనివారం ఒక్కరోజే 30 మందికి పాజిటివ్‌

ఆర్జిత సేవలు, అన్నదానం బంద్‌

ఆలయమంతా శానిటైజేషన్‌

సాక్షి, యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో కరోనా కలకలం రేపుతోంది. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పలువురు అర్చకులు, అధికారి, సిబ్బందికి పాజిటివ్‌ రావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల జరిగిన శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాజిటివ్‌ వచ్చిన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. దీంతో ఒక్కొక్కరుగా ఆస్పత్రికి క్యూ కట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు. 

కేసులు ఇలా..
యాదగిరిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈనెల 25వ తేదీన నిర్వహించిన కరోనా పరీక్షల్లో యాదాద్రి ఆలయానికి చెందిన ఓ అర్చకుడికి పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. 26న మరికొందరు పరీక్షలు చేయించుకోగా నలుగురు యాదాద్రి అర్చకులు, సిబ్బంది, మరో ఇద్దరు హయగ్రీవ స్వామి ఆలయ అర్చకులకు (వీరు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు) పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక శనివారం చేసిన పరీక్షల్లో 30 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో అర్చకులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.  

భౌతిక దూరం విడిచి.. మాస్క్‌లు మరిచి 
ఓ వైపు కరోనా వ్యాప్తి చెందుతున్నా యాదాద్రి క్షేత్రంలో కోవిడ్‌ – 19 నిబంధనలు గాలికొదిలేస్తున్నారు. లాక్‌డౌన్‌ నిబంధనల అనంతరం ఆలయంలో కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టారు. కానీ, క్రమేణా వాటిని మరిచారు. ఆలయానికి వచ్చే భక్తులు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మాస్కులు ధరించకుండానే ఆలయ పరిసరాల్లో తిరుగుతున్నారు. కనీసం భౌతికదూరం కూడా పాటించడం లేదు. అన్‌లాక్‌ కావడంతో యాదాద్రి క్షేత్రానికి హైదరాబాద్‌ జంటనగరాలతో పా టు వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఈ నెల 15నుంచి 25వ తేదీ వరకు జరిగిన బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్తులు అలంకార సేవలు, తిరుకల్యాణం, రథోత్సవం, శ్రీ చక్ర స్నానం వేడుకల్లో పాల్గొన్నారు. ఆ సమయంలో గుంపులుగా కూర్చోవడం, మాస్కులు ధరించకపోవడంతో ఆలయంలో అర్చకులు, అధికారులు, సిబ్బందికి కరోనా సోకినట్లు తెలుస్తోంది. 

అప్రమత్తమైన అధికార యంత్రాంగం 
శ్రీస్వామి క్షేత్రంలో విధులు నిర్వహించే పలువురు అర్చకులు, అధికారులు, సిబ్బంది కరోనా బారిన పడడంతో ఆలయ అధికారులు అప్రమత్తమయ్యా రు. ఆలయంతో పాటు ఆలయ పరిసరాలు, క్యూలైన్లు, ఈఓ, వివిధ సెక్షన్ల కార్యాలయాల్లో శానిటైజేషన్‌ చేశారు. క్యూలైన్లలో శానిటేషన్‌ డబ్బాలు ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్య సిబ్బందితో ఆలయ పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారు. 

మూడు రోజులు ఆర్జిత సేవలు బంద్‌
కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఆలయంలో శ్రీస్వామి వారికి నిర్వహించే ఆర్జిత సేవలను మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి ప్రకటించారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆర్జీత సేవలు నిలిపివేశామన్నారు. నిత్య పూజలన్నీ అంతరంగికంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఘాట్‌ రోడ్డులోని జీయర్‌ కుటీర్‌లో రోజూ  నిర్వహించే అన్నదానం సైతం మూడు రోజుల పాటు బంద్‌ చేసినట్లు చెప్పారు. కేవలం భక్తులకు లఘు దర్శనం మాత్రమే కల్పించనున్నట్లు ఈఓ వెల్లడించారు. క్షేత్రానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు.

చదవండి: సూర్యపేట గ్యాలరీ స్టాండ్‌ ప్రమాదం: ప్రధాన కారణం ఇదే!

మరిన్ని వార్తలు