ఆర్టీసీకి 300 నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు

20 Jun, 2022 01:23 IST|Sakshi

అద్దె ఒక్కో కిలోమీటర్‌కు రూ.41.58.. ఖరారు చేసిన ‘ఫేమ్‌–2’

డీజిల్‌ ధరల మంట వేళ సంస్థకు ఉపశమనం 

వచ్చే మార్చి నాటికి తొలి విడతగా 150 బస్సులు

హైదరాబాద్‌లో మెట్రో ఎక్స్‌ప్రెస్‌లుగా తిప్పాలని నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: అడ్డగోలుగా పెరిగిన డీజిల్‌ ధరలు బెంబేలెత్తిస్తున్న సమయంలో ఆర్టీసీకి కాస్త ఉపశమనం కలగనుంది. కేంద్ర ప్రభుత్వం ‘ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ఆఫ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ (ఫేమ్‌)–2’ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్‌ బస్సులను మంజూరు చేసింది. వాటిని గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు (జీసీసీ) పద్ధతిలో ఆర్టీసీకి అద్దెకు ఇస్తారు.

ఈ బస్సుల కాంట్రాక్టు పొందిన సంస్థకు ఆర్టీసీ ప్రతి కిలోమీటర్‌కు రూ.41.58 చొప్పున అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు కిలోమీటర్‌కు రూ.60కిపైగా ఖర్చవుతున్నట్టు ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. అదే ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులోకి వస్తే ఖర్చు గణనీయంగా తగ్గుతుందని అంటున్నాయి. తొలి విడతగా వచ్చే మార్చి నాటికి 150 బస్సులు ఆర్టీసీకి అందనున్నాయి. మిగతావి ఆ తర్వాత రానున్నాయి.

నాన్‌ ఏసీ బస్సుల కోసం పట్టుబట్టి..
గతంలో జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకం కింద హైదరాబాద్‌కు 80 ఏసీ డీజిల్‌ బస్సులు రాగా.. వాటిని వివిధ మార్గాల్లో తిప్పారు. ఏసీ బస్సులు కావటంతో టికెట్‌ ధరలు ఎక్కువగా ఉండేవి. జనం ఎక్కేందుకు జంకటంతో ఖాళీగా తిరిగి ఆర్టీసీకి నష్టాలు పెంచాయి. వాటిలో ఇతర పట్టణాలకు కొన్ని, ఎయిర్‌పోర్టుకు కొన్నింటిని నడుపుతున్నారు. తర్వాత ఫేమ్‌–1 పథకం కింద 40 ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరయ్యాయి.

అవికూడా ఏసీ బస్సులు కావడంతో విమానాశ్రయానికి, నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య తిప్పుతున్నారు. ఈ క్రమంలోనే ‘ఫేమ్‌–2’ పథకం కింద నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులు కావాలని ఆర్టీసీ కోరింది. ఓ ప్రైవేట్‌ తయారీ సంస్థ మళ్లీ ఏసీ బస్సులే మంజూరయ్యేలా చక్రం తిప్పినా.. చివరకు ఆర్టీసీ పట్టే నిలిచింది. 300 నాన్‌ ఏసీ బస్సులను కేంద్రం మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎస్‌ఎల్‌) అనుబంధ సంస్థ అయిన ‘కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (సీఈఎస్‌ఎల్‌)’ ఈ ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేయనుంది.

ప్రస్తుతం విమానాశ్రయానికి తిప్పుతున్న ఎలక్ట్రిక్‌ బస్సులను జీసీసీ పద్ధతిలోనే అద్దెకు తీసుకున్నారు. ఒలెక్ట్రా కంపెనీ వాటిని తిప్పుతోంది. రోజూ 300 కిలోమీటర్ల పైబడి తిరిగే బస్సులకు కి.మీ.కి రూ.33.80 చొప్పున.. అంతకన్నా తక్కువ తిరిగే బస్సులకు కి.మీ.కి రూ.38 చొప్పున ఆర్టీసీ అద్దె చెల్లిస్తోంది. బ్యాటరీ చార్జింగ్‌ ఖర్చుల కింద ఒక్కో కి.మీ.కి రూ.6 ఖర్చవుతోంది. కొత్తగా రానున్న నాన్‌ ఏసీ ఎలక్ట్రిక్‌ బస్సులకు చార్జింగ్‌ ఖర్చుతో కలిపి ఒక్కో కి.మీ.కి రూ.41.58 అద్దె చెల్లించనున్నారు. బస్సులను నిర్వహించే ప్రైవేటు సంస్థనే డ్రైవర్లను ఏర్పాటు చేస్తుంది. కండక్టర్లు మాత్రం ఆర్టీసీ నుంచి ఉంటారు.  

మరిన్ని వార్తలు