TS: రాష్ట్రంలో నీట్‌ అర్హులు 36,795 మంది

24 Sep, 2022 02:18 IST|Sakshi

టాప్‌ ర్యాంకర్‌ ఎర్రబెల్లి సిద్దార్థరావు 

సెకండ్‌ ర్యాంకర్‌ చప్పిడి లక్ష్మీ చరిత 

టాప్‌ 50లో 22 మంది బాలికలు 

ర్యాంకులు విడుదల చేసిన కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రస్థాయి నీట్‌ ర్యాంకులు శుక్రవారం విడుదలయ్యాయి. రాష్ట్రం నుంచి 36,795 మంది నీట్‌ పరీక్షలో అర్హత సాధించినట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. నీట్‌ జాతీయ స్థాయిలో ఐదో ర్యాంకు సాధించిన ఎర్రబెల్లి సిద్ధార్థరావు.. తెలంగాణ రాష్ట్రంలో టాప్‌ ర్యాంకర్‌గా నిలిచారు. జాతీయ స్థాయిలో 37వ ర్యాంకు సాధించిన చప్పిడి లక్ష్మీచరిత రాష్ట్రంలో రెండో ర్యాంకు సాధించారు.

జాతీయ స్థాయి 41వ ర్యాంకర్‌ జీవన్‌కుమార్‌రెడ్డి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచారు. తొలి 50 స్థానాల్లో.. 28 మంది బాలురు, 22 బాలికలు ఉన్నారు. అర్హత కటాఫ్‌ మార్కులను ఓపెన్‌ కేటగిరీలో 117, బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు 93 మార్కులు, పీడబ్ల్యూడీ జనరల్‌కు 105 మార్కులుగా నిర్ణయించారు. ఈ రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో ఎవరైనా విద్యార్థుల పేర్లులేకుంటే కంగారు పడాల్సిన అవసరం లేదని, తర్వాత కౌన్సెలింగ్‌ సందర్భంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

పొరపాటున కొందరు ర్యాంకర్ల పేర్లు ఇతర రాష్ట్రాల పరిధిలోకి వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో టాప్‌ వెయ్యి ర్యాంకర్లు ఆలిండియా సీట్లలో చేరే అవకాశం ఉందని.. మిగతావారు రాష్ట్ర స్థాయి కాలేజీల్లో చేరుతారని కాళోజీ వర్సిటీ వర్గాలు అంటున్నాయి. 

ఎంబీబీఎస్‌లో ఈడబ్ల్యూఎస్‌ కోటా సీట్లు 215 
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్‌)కు 215 సీట్లు కేటాయించినట్లు కాళోజీ వర్గాలు వెల్లడించాయి. ఇందులో గాంధీ, కాకతీయ మెడికల్‌ కాలేజీల్లో 50 సీట్ల చొప్పున, ఆదిలాబాద్‌ రిమ్స్, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 20 సీట్ల చొప్పున, మహబూబ్‌నగర్, సిద్దిపేట మెడికల్‌ కాలేజీల్లో 25 సీట్ల చొప్పున, మిగతావి ఈఎస్‌ఐ మెడికల్‌ కాలేజీలో ఉన్నాయని పేర్కొన్నాయి.

అయితే ఇందులో సగం సీట్లను మాత్రమే ఈడబ్ల్యూఎస్‌ కోటా అర్హులైన వారితో భర్తీ చేస్తామని.. మిగతా సీట్లను ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయిస్తామని విశ్వవిద్యాలయం తెలిపింది. నిబంధనల ప్రకారం ఈడబ్ల్యూఎస్‌ కోటాలో ఎన్ని సీట్లను భర్తీ చేస్తారో, అన్ని సీట్లను మిగిలిన రిజర్వేషన్లకు కేటాయించాల్సి ఉంటుందని పేర్కొంది. 

రాష్ట్రంలో 5,965 సీట్లు 
ప్రస్తుత లెక్కల ప్రకారం తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో కలిపి 2022–23 వైద్య విద్యా సంవత్సరానికి 5,965 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వంలోని అన్ని సీట్లను, ప్రైవేటు కాలేజీల్లోని 50శాతం సీట్లను కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 15శాతం సీట్లను ఆలిండియా కోటా కింద జాతీయస్థాయిలో భర్తీ చేస్తారు. వాటిలో రెండు విడతల కౌన్సెలింగ్‌ తర్వాత సీట్లు ఏవైనా మిగిలితే.. వాటిని రాష్ట్రానికి అప్పగిస్తారు. వచ్చేనెల రెండో వారంలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు ప్రకటన జారీచేసే అవకాశం ఉందని కాళోజీ వర్సిటీ వర్గాలు తెలిపాయి.  

మరిన్ని వార్తలు