తప్పనిసరి జాబితాలోకి కొత్తగా 39 రకాల ఔషధాలు

3 Oct, 2021 04:52 IST|Sakshi

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడి 

ఆ జాబితా నుంచి 16 రకాల మందుల తొలగింపు

కొత్తవాటిలో షుగర్, క్యాన్సర్, యాంటీ బయాటిక్స్‌ మందులు 

ప్రజారోగ్యంలో కీలక మందులుగా ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: తప్పనిసరి జాబితాలో కొత్తగా 39 రకాల ఔషధాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు చేర్చారు. ప్రజారోగ్యంలో నిత్యం వినియోగించే ఔషధాలనే తప్పనిసరి జాబితాలో చేరుస్తుంటారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నేషనల్‌ లిస్టింగ్‌ ఆఫ్‌ ఎసెన్షియల్‌ మెడిసిన్‌– 2021ను విడుదల చేసింది.

దీంతో ఈ మందులను అనేక కంపెనీలు తయారు చేయడానికి, వాటి ధరలు నియంత్రణలోకి రావడానికి మార్గం సుగమమైంది. ఈ జాబితాలో ఎక్కువగా క్యాన్సర్, షుగర్‌ నియంత్రణ, యాంటీబయాటిక్స్‌ వంటి మందులున్నాయి. అయితే ఇప్పటికే జాబితాలో ఉన్న 16 రకాల ఔషధాలను తీసేశారు. మార్పులు, చేర్పుల తర్వాత తప్పనిసరి జాబితాలో ప్రస్తుతం 874 మందులున్నాయని కేంద్రం తెలిపింది.  

ప్రజారోగ్య పరిరక్షణకు  తప్పనిసరైతేనే... 
దేశంలో 1996లో తొలిసారి తప్పనిసరి మందులజాబితాను తయారు చేయగా, 2015లో విధివిధానాలను రూపొందించారు. ఈ జాబితాలో చేర్చాల్సిన మందుకు లైసెన్స్‌ ఉండాలి. సంబంధిత జబ్బు ప్రజారోగ్య సమస్యగా ఉండాలి. ఇప్పటికే అందులో ఉన్న మందు నిషేధానికి గురైనా, రియాక్షన్లు వచ్చినా ఆ జాబితా నుంచి తీసేస్తారు.

ప్రస్తుతం జాబితాలో చేర్చిన మందుల్లో ప్రధానంగా క్యాన్సర్, టీబీ, ఆస్తమాకు సంబంధించిన కొన్ని రకాల స్టెరాయిడ్స్, పొగ సంబంధిత ఉత్పత్తుల వాడకాన్ని మాన్పించేవి, విషవిరుగుడు మందులు, లేబొరేటరీలో తయారు చేసిన ఇన్సులిన్‌ మందు, యాంటీవైరల్స్, యాంటీ పారసైట్స్, గర్భధారణ నియంత్రణ మందులు, రోటావైరస్‌ వ్యాక్సిన్‌ ఉన్నాయి.

ప్రస్తుతం రూ.50 వేల వరకు ధర కలిగిన గుండెపోటు మందులు.. ప్రధానంగా గుండె రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తాన్ని పలుచపరిచే మందు, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌–బి, యాంటీ ఫంగల్‌ సంబంధించిన మందులను తప్పనిసరి జాబితాలో చేర్చారు. ఈ జాబితా నుంచి తీసేసినవాటిల్లో బీపీ మందు ఎటినలాల్, బ్లీచింగ్‌ పౌడర్, యాంటీబయోటిక్‌కు చెందిన ఎరిత్రోమైసిన్, గర్భధారణను నియంత్రించే కొన్ని రకాల మందులున్నాయి. జాబితాలో చేర్చిన మందును ఐదేళ్లపాటు కొనసాగించాలి. చిన్న, చిన్న విషయాలకు తొలగించకూడదు. దీంతో కంపెనీలు ఆ ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి ముందుకు వస్తాయి. 

భారాన్ని తగ్గించేందుకే 
ప్రజారోగ్య పరిరక్షణకు వినియోగించే మందుల ధరలు ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరి మందుల జాబితాలో చేరుస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం... దేశంలో మందులపై పెట్టే ఖర్చులో 90 శాతం మేర ప్రజల జేబులు గుల్ల అవుతున్నాయి. ఇది ప్రపంచంలోనే అత్యధికం. ఆ భారాన్ని తగ్గించేదిశగా మనదేశం 2015 నుండి మందుల జాబితాను క్రమబద్ధీకరిస్తోంది. ఈ ఏడాది అలాంటివాటిలో ఇన్సులిన్, క్యాన్సర్, హెచ్‌ఐవీ మందులు ఎక్కువగా ఉన్నాయి. ఈ మందులు ధరలు నియంత్రణ జాబితాలోకి వస్తే ప్రజలపై భారం కొంత తగ్గుతుంది.  


–డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ 

మరిన్ని వార్తలు