శ్మశానం కోసం 4 కిలోమీటర్ల ప్రయాణం 

20 Nov, 2022 03:05 IST|Sakshi
పాడె ఎత్తుకుని నిలబడిన దృశ్యం 

స్థల వివాదం.. నిలిచిన శవదహనం 

2 గంటలు పాడెపైనే మృతదేహం 

పోలీసుల జోక్యంతో సద్దుమణిగిన సమస్య

కోరుట్ల: శ్మశానవాటికకు స్థల కేటాయింపు వివాదాస్పదం కావడంతో.. అంత్యక్రియల కోసం నాలుగు కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వచ్చింది. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని ఏసికోనిగుట్ట కాలనీకి చెందిన వంగాల ఈశ్వరయ్య (56) అనారోగ్యంతో శనివారం ఉదయం మృతి చెందాడు. ఆ కాలనీ వాసులకోసం గతంలో మున్సిపల్‌ అధికారులు కేటాయించినట్లుగా భావిస్తున్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

మృతదేహాన్ని అక్కడికి తీసుకెళ్తుండగా సమీపంలోని ఇళ్లకు చెందినవారు అడ్డుకున్నారు. అక్కడ శ్మశానం కోసం స్థలం కేటాయించలేదని.. తమ ఇళ్ల ముందు శవదహనం చేయడం కుదరదని పట్టుబట్టారు. దీంతో పాడె మీద ఉన్న మృతదేహాన్ని కిందకి దించలేక సుమారు 2 గంటలపాటు అలాగే ఎత్తుకుని ఉన్నారు. ఇరువర్గాల మధ్య వివాదం ముదరడంతో ఎస్సైలు సతీష్, శ్యాంరాజ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలతో చర్చలు జరిపారు. శ్మశానం కేటాయింపు విషయంలో స్పష్టత లేదని మున్సిపల్‌ అధికారులు కూడా చెప్పడంతో కాలనీకి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదర్శనగర్‌ పూల్‌వాగు శ్మశాన వాటికకు మృతదేహాన్ని తీసుకెళ్లారు. అక్కడ అంత్యక్రియలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు