ఇల్లు ఒకటే.. రెండు రాష్ట్రాలకు పన్ను.. 4 గదులు తెలంగాణలో, 4 గదులు మహారాష్ట్రలో..

16 Dec, 2022 17:36 IST|Sakshi

ముంబై/హైదరాబాద్‌: ఒక్క ఇంట్లో రెండు రాష్ట్రాలకు పన్ను కట్టాల్సి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అదే ఇంట్లో నివసిస్తూ ఒక రాష్ట్రంలో భోజనం చేసి మరో రాష్ట్రంలో నిద్రపోవాల్సిన పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. వినడాకిని వింతగా ఉన్నా.. ఇలాంటి ఇల్లు నిజంగానే ఉంది.

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులోని చంద్రాపూర్ జిల్లా మహారాజగూడ గ్రామంలో ఈ ఇల్లు ఉంది. పవార్ బ్రదర్స్ దీని యజమానులు. 13 మంది కుటుంబసభ్యులు ఇందులో నివసిస్తున్నారు. మొత్తం 10 గదులున్నాయి. నాలుగు గదులు మహారాష్ట్ర కిందకి, మరో నాలుగు గదులు తెలంగాణ కిందకు వస్తాయి. అందుకే రెండు రాష్ట్రాలకు ఈ కుటుంబం పన్ను కడుతోంది.

అయితే పన్ను ఎక్కువ కట్టాల్సి వస్తోందని వీళ్లు బాధపడటం లేదు. ఎందుకంటే రెండు రాష్ట్రాల సంక్షేమ పథకాలను వీరు చక్కగా ఉపయోగించుకుంటున్నారు. వాహనాల రిజిస్టేషన్లను ఎంహెచ్, టీఎస్‌తో ఇనీషియల్స్‌తో చేయించుకుంటున్నారు.

1969 మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించినప్పుడు తమ ఇళ్లు రెండు రాష్ట్రాల కిందకు వచ్చిందని యజమానులు ఉత్తమ్ పవార్, చందు పవార్ చెబుతున్నారు. అప్పటి నుంచి ఇదే ఇంట్లో ఉంటున్నట్లు పేర్కొన్నారు.

ఇప్పటివరకు మహారాజగూడ గ్రామానికి మాత్రమే తెలిసిన ఈ ఇల్లు గురించి ఇప్పుడు దేశంలో అందిరికీ తెలిసింది. తమ ఇల్లు రెండు రాష్ట్రాల్లో ఉండటం వల్ల తమకెలాంటి ఇబ్బంది అన్పించడంలేదని పవార్ సోదరులు చెబుతున్నారు. తన నాలుగు గదులు మహారాష్ట్రలో, తన సోదరుడు చందు కుటుంబం నివసించే మరో నాలుగు గదులు తెలంగాణలో ఉన్నట్లు ఉత్తమ్ వివరించారు. తన కిచెన్ మాత్రం తెలంగాణలోనే ఉందన్నారు.
చదవండి: షాకింగ్.. నాలుగు కాళ్లతో జన్మించిన శిశువు.. ఫొటో వైరల్..

మరిన్ని వార్తలు