వెయ్యి క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

18 Sep, 2022 02:25 IST|Sakshi
లారీలో బియ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు  

పెద్దపల్లి రూరల్‌: రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా తరలి స్తున్న 4 లారీలను పెద్దపల్లి విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్, టాస్క్‌ఫోర్స్, పౌరసరఫరాల అధికారులు శనివారం పట్టు కున్నారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల నుంచి నాలుగు లారీల బియ్యాన్ని పెద్దపల్లికి అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో అధికారులు తనిఖీలు చేశారు. ఒక్కో లారీలో 270 క్వింటాళ్ల చొప్పున మొత్తం నాలుగు లారీల్లో 1,080 క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తున్నట్లు గుర్తించారు. నాలుగు లారీలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్‌ తెలిపారు. పట్టుబడ్డ లారీలను పెద్దపల్లిలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

తప్పించేందుకు యత్నం: పెద్దపల్లి మండలం రంగాపూర్‌ గోదాములకు ఎలాంటి వేబిల్లులు లేకుండా వచ్చిన బియ్యం లారీలను అధికారులు పట్టుకోగా.. కేసు నమోదు చేయకుండా తప్పించేందుకు ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తోంది. అధికారులపై ఒత్తిళ్లు రావడంతో బోగస్‌ వేబిల్లులను సృష్టించి వాటి ఆధారంగా లారీలను వదిలేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి అక్కడకు వెళ్లిన మీడియాకు.. బియ్యం అక్రమం కాదని కొందరు చెప్పడం ఇందుకు బలం చేకూర్చుతోంది.

టాస్క్‌ఫోర్స్‌ అధికారుల ఎంట్రీతో..: టాస్క్‌ఫోర్స్, రాష్ట్ర విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల రాకతో కథ అడ్డం తిరిగింది. లారీలకు సంబంధించి బోగస్‌ వేబిల్లులను అధికారులకు చూపించగా.. లారీల వెంట లేని వేబిల్లులు ఇప్పుడెలా వచ్చాయన్న అధికారుల ప్రశ్నకు సమాధానం రాలేదు. దీంతోవారు లారీల డ్రైవర్ల గురించి ఆరా తీశారు. అప్పటివరకు అక్కడే ఉన్న డ్రైవర్లు, వాటి సంబంధిత వ్యక్తులు టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల రాకతో కనిపించకుండా పోయారు. ఈ నేపథ్యంలో వేబిల్లులు బోగస్‌వని, లారీల్లో ఉన్నవి రేషన్‌ బియ్యమేనని తేలడంతో నాలుగు లారీలను సీజ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు