నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసిన కారు..

5 Dec, 2022 19:35 IST|Sakshi
కీర్తన(ఫైల్‌)  

సాక్షి, మెదక్‌: నిర్లక్ష్యపు డ్రైవింగ్‌  నాలుగేళ్ల చిన్నారిని చిదిమేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన మెదక్‌ జిల్లా హవేలీఘనపూర్‌ మండలం బూరుగుపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాబు–నవ్య దంపతుల ఏకైక కుమార్తె కీర్తన (4) అంగన్‌వాడీ సెంటర్‌కు వెళ్తుంది. ఆదివారం సాయంత్రం గ్రామంలో ఆడుకుంటూ రోడ్డుదాటే ప్రయత్నం చేసింది. అదే గ్రామంలోని ఓ రైస్‌ మిల్‌ యజమాని కుమారుడు కారును వేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ చిన్నారిని ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన కీర్తన రక్తపుమడుగులో కొట్టుమిట్టాడి అక్కడే చనిపోయింది. కారు డ్రైవర్‌ ప్రమాదస్థలం నుంచి పారిపోయే ప్రయత్నం చేయగా స్థానికులు పట్టుకున్నారు. అదే కారులో చిన్నారిని మెదక్‌ పట్టణంలోని ఆస్పత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఈ విషయమై ఇంకా ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఎస్‌ఐ మురళీ తెలిపారు.
చదవండి: ‘సారీ.. అన్నయ్య మిస్‌ యూ’.. అంటూ మెసెజ్‌ పెట్టి..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు