45 ఏళ్లు పైబడినవారికి 53 % టీకాలు

2 Jul, 2021 08:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా టీకాల కార్యక్రమం వ్యూహాత్మకంగా కొనసాగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టగలిగినట్లు పేర్కొంది. ప్రాధాన్య వర్గాలు (సూపర్‌ స్ప్రెడర్స్‌), అధిక ముప్పు (రిస్క్‌) ఎక్కువగా ఉన్న పెద్దలకు టీకాలు వేయడం ద్వారా వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు వివరించింది. ఈ మేరకు గురువారం తాజాగా నివేదిక విడుదల చేసింది. నెల రోజుల్లోనే సూపర్‌ స్ప్రెడర్స్‌కు పెద్దఎత్తున టీకాలు అందజేసినట్లు తెలిపింది. గత నెల 30వ తేదీ నాటికి 94,92,680 మంది టీకాలు వేసుకోగా, మొత్తంగా 1,10,69,989 డోసులు అందజేశారు. ఇందులో మొదటి డోసు తీసుకున్నవారు 94,92,680 మంది కాగా, రెండో డోసు తీసుకున్నవారు 15,77,309 మంది ఉన్నారు. అయితే మొత్తం టీకాల పంపిణీలో 41 శాతం మంది ప్రాధాన్య వర్గాలేనని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ కేటగిరీకి చెందిన 18–44 ఏళ్ల మధ్యవయస్కుల్లో ఇప్పటివరకూ 39,15,961 మందికి మొదటి డోసు, 49,217 మందికి రెండో డోసు ఇచ్చారు. 18–44 ఏళ్ల మధ్య వయస్సు వారిలో మొదటి విడతలో ఎల్‌పీజీ డీలర్లు, కార్మికులు, పెట్రోల్‌ బంక్‌లో పనిచేసే సిబ్బంది, మీడియా రంగంలోని వారు, పురుగులమందు దుకాణదారులు, ఆర్టీసీ ఉద్యోగులు తదితరులకు కలిపి మొత్తంగా 1,19,731 డోసులు ఇచ్చారు.

రెండో విడతలో రైతుబజార్లు, కిరాణా, వస్త్రదుకాణాలు, మద్యం షాపుల్లో పని చేసేవారు, వీధి వ్యాపారులు, ఆటో, క్యాబ్‌ డ్రైవర్లు, ఉపాధ్యాయులు తదితరులందరికీ కలుపుకొని మొత్తంగా 28,92,472 డోసులను అందజేశారు. మూడో విడతలో ఎక్సైజ్, ఇంజినీరింగ్, వ్యవసాయ సిబ్బంది తదితరులు కలుపుకొని 4,73,685 డోసులను అందజేశారు. మే నెల 28న వీరికి టీకాల పంపిణీని ప్రారంభించి నెల రోజుల్లోనే 34.85 లక్షల డోసులను అందజేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ఆ నివేదికలో తెలిపింది. ఇప్పటివరకూ పంపిణీ చేసిన మొత్తం టీకాల్లో 53 శాతం మంది 45 ఏళ్లు పైబడినవారున్నారు. వైద్య సిబ్బంది 3 శాతం, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు 3 శాతం మంది నమోదైనట్లు నివేదిక తెలిపింది.

మరిన్ని వార్తలు