మనోళ్ల బీపీ హై

5 Dec, 2022 01:31 IST|Sakshi

దేశంలో 50 శాతం మందికి హై బ్లడ్‌ప్రెషర్‌ ఉన్న విషయమే తెలియదు

బీపీ పేషెంట్లలో 75 శాతానికిపైగా నియంత్రణలో ఉండడం లేదు 

‘సిస్టమాటిక్‌ రివ్యూ–మెటా అనాలిసిస్‌’2001–2022లో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: మనవాళ్లను రక్తపోటు సమస్య పట్టి పీడిస్తోంది. దేశంలోని 50 శాతానికి పైగా జనం తమకు అధిక రక్తపోటు ఉన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. బీపీ పేషెంట్లలో 75 శాతం కంటే ఎక్కువ మందికి రక్తపోటు నియంత్రణలో ఉండడం లేదు. ఈ బీపీ స్థాయిలతో వారి రోజువారీ జీవనం అతలాకుతలం అవుతోంది. ఈ సమస్య పేదవర్గాల్లోనూ ఉంది. యువజనుల్లోనూ బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

బీపీ గుండెసంబంధిత జబ్బుల్లో ప్రమాదకారిగా, ప్రాణాంతకంగా మారుతోంది. 2001–2022ల మధ్య భారత్‌లోని పెషేంట్లపై నిర్వహించిన ‘సిస్టమాటిక్‌ రివ్యూ అండ్‌ మెటా అనాలిసిస్‌ ఆఫ్‌ పాపులేషన్‌ లెవల్‌ నాన్‌–ఇంటర్వెన్షనల్‌ స్టడీస్‌’లో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

ఢిల్లీలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్, అమెరికాలోని బోస్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్, కేరళలోని గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ–మంజేరీ, కిమ్స్‌ అల్‌–షిఫా స్పెషాలిటీ హాస్పిటల్‌–పెరింతల్‌మన్న సహా వివిధ బృందాలు జరిపిన పరిశోధనలను, 51 అధ్యయనాలను సమీక్ష నిర్వహించారు. ఈ పరిశీలనలో భాగంగా దాదాపు 15 లక్షల మంది బీపీ పేషెంట్లను పరిశీలించారు. ఈ అధ్యయానికి సంబంధించిన తాజా నివేదిక లాన్సెట్‌ రీజనల్‌ హెల్త్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. 

అధ్యయనంలోని ముఖ్యాంశాలు..
ఇండియాలోని 15–49 ఏళ్ల మధ్యలోని 50 శాతం మందికి తమ బీపీ గురించి తెలియదు 
22.5 శాతం పేషెంట్లలో మాత్రమే బీపీ నియంత్రణలో ఉంటోంది 
భారత్‌లో దక్షిణాదితో పోల్చితే ఉత్తరాదిలో ఈ సమస్యపై తక్కువ అధ్యయనం 
దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో మెరుగైన రీతిలో నియంత్రణ  
పురుషుల్లో నియంత్రణ శాతం తక్కువే 
జీవనశైలిలో మార్పులు, అనారోగ్యకరమైన అలవాట్లతో బీపీ నియంత్రణలో ఉండటం లేదు.

నియంత్రణ కోసం..
బీపీ నియంత్రణ శాతాన్ని పెంచేందుకు భారత్‌లో సుస్థిర కమ్యూనిటీ ఆధారిత వ్యూహాలు అనుసరించాలి 
సమస్య తీవ్రత గుర్తించేందుకు మరింత మెరుగైన కమ్యూనిటీ స్థాయి డేటా అవసరం 

‘సైలెంట్‌కిల్లర్‌’గా మారింది...  
బీపీ పట్ల అప్రమత్తత అవసరం. గతంలో 50, 60 ఏళ్లు దాటితేనే బీపీ, షుగర్‌ వస్తాయని భావించేవారు. జీవనశైలి మారడం, పాశ్చాత్య పోకడలకు అనుగుణంగా మారిన ఆహార అలవాట్లతో 20–25 ఏళ్ల యువతలో బీపీ కేసులు పెరుగుతున్నాయి. జంక్‌ఫుడ్, అధిక ఆయిల్, ఫ్రైడ్‌ ఫుడ్, సోడియం మోతాదు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల తెలియకుండానే బీపీ పేషెంట్లుగా మారుతున్నారు.

బీపీ నియంత్రణలో లేని వారు డయాబెటిస్, హైపర్‌టెన్సివ్‌ రెటినోపతి, కిడ్నీ ఫెయిల్యూర్స్, గుండెపోటు బారిన పడుతున్నారు. విదేశాల్లో అయితే క్రమం తప్పకుండా ఆయా వయసుల వారికి వివిధరకాల పరీక్షలు నిర్వహిస్తారు. అక్కడ పౌరుల ఆరోగ్యం గురించిన వివరాలు, మెడికల్‌ రికార్డ్స్‌ను భద్రపరుస్తారు. మన దగ్గరా ఆ పద్ధతులు రావాలి. ప్రతి ఒక్కరూ బీపీని తరచూ పరీక్షించుకోవాలి.  
– డా.ఎ.నవీన్‌రెడ్డి, క్రిటికల్‌కేర్‌ నిపుణుడు, నవీన్‌రెడ్డి హాస్పిటల్‌  

బీపీ ఉన్నా తెలియడం లేదు..
తెలంగాణలో, హైదరాబాద్‌లో రక్తపోటుల్లో వచ్చే తేడాల గురించి ఎక్కువమందికి అవగాహన ఉండడం లేదు. గ్రామీణప్రాంతాల్లోని 60 శాతం మందికి తమకు బీపీ, షుగర్‌ ఉన్న విషయమే తెలియడం లేదు. తల కింది భాగంలో నొప్పి, మెడ భారంగా ఉండడం, నిద్రపోయినపుడు ఆక్సిజన్‌ సరిగా అందక స్లీప్‌ అప్నీయా, ఉదయం నిద్ర లేచాక కూడా ఫ్రెష్‌గా అనిపించకపోవడం వంటివి బీపీకి కారణాలుగా తెలుసుకోవాలి.

బీపీ పెరిగి రక్తనాళాలు చిట్లి, పక్షవాతం బారిన పడే దాకా కూడా కొందరు గ్రహించలేకపోతున్నారు. మద్యం, సిగరెట్లు, మసాలాలతో కూడిన ఆహారం, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఇతర చెడు వ్యసనాలు దీనికి కారణం అవుతున్నాయి. బీపీకి సంబంధించి 120/80 సాధారణంగా, 140/90 మధ్యతరహా, 150/100 తీవ్రమైనదిగా పరిగణిస్తాం. చిన్న విషయానికే ఆవేశపడటాన్ని ఆగ్జిలేటరీ హైపర్‌ టెన్షన్‌గా చూడాలి. 
– డా. ప్రభుకుమార్‌ చల్లగాలి, సీనియర్‌ ఫిజీషియన్, లైఫ్‌ స్పెషాలిటీస్‌ నర్సింగ్‌హోం  

మరిన్ని వార్తలు