నేటి నుంచి బడులకు 50 శాతం టీచర్లు

21 Sep, 2020 05:20 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఉపాధ్యాయులకు రోజు విడిచి రోజు డ్యూటీలు 

బడికి రాని రోజు ఇంటి నుంచే పర్యవేక్షణ

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం జారీ చేసిన కోవిడ్‌ అన్ లాక్‌ – 4 మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాశాఖ ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల మేరకు టీచర్లు మళ్లీ బడిబాట పట్టనున్నారు. సోమవారం నుంచి 50 శాతం మంది టీచర్లు బడులకు హాజరుకానున్నారు. 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులను తల్లిదండ్రులు పంపించాలనుకుంటే ఈనెల 21వ తేదీ నుంచి స్కూళ్లకు వెళ్లవచ్చని కేంద్రం గత నెల 31వ తేదీన జారీ చేసిన అన్‌ లాక్‌–4 మార్గదర్శకాల్లో పేర్కొంది. అయితే రాష్ట్రంలో అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో సోమవారం నుంచి విద్యార్థులు లేకుండానే పాఠశాలలు కొనసాగనున్నాయి. ఇక గత నెల 27వ తేదీనుంచి టీచర్లంతా బడులకు వెళ్లేలా విద్యాశాఖ అప్పట్లో ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ తరువాత కేంద్రం 50 శాతం మంది టీచర్లనే బడులకు అనుమతిస్తూ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయినా కొద్ది రోజులు 100 శాతం టీచర్ల హాజరునే రాష్ట్ర విద్యాశాఖ కొనసాగించింది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో వెనక్కి తగ్గింది. ఈనెల 21 నుంచి 50 శాతం మంది టీచర్లు పాఠశాలలకు హాజరయ్యేలా ఈనెల 11న ఉత్తర్వులు జారీ చేసింది. దాని ప్రకారం నేటి నుంచి పాఠశాలలకు 50 శాతం మంది టీచర్లు హాజరు కానున్నారు. రోజు విడిచి రోజు సగం మంది టీచర్లు బడులకు వచ్చేలా ఉన్నత పాఠశాల హెడ్‌మాస్టర్లు షెడ్యూలు తయారు చేసి డీఈవోలకు పంపించాలని, ప్రాథమిక, ప్రాథమికోన్నత స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు తమ స్కూళ్లలో ఉన్న టీచర్ల హజరుకు సంబంధించి షెడ్యూలు రూపొందించి స్కూల్‌ కాంప్లెక్స్‌ హెడ్‌మాస్టర్లకు, ఎంఈవోలకు పంపించాలని అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు