రైతన్న కన్నీటి వరద.. పెట్టుబడి కష్టం వర్షార్పణం.. వందల కోట్లలో నష్టం

16 Jul, 2022 07:59 IST|Sakshi

మొలక దశలో దెబ్బ.. మరికొన్నిచోట్ల కుళ్లిపోయిన విత్తనాలు

గోదావరి తీరం వెంట ఎక్కువగా నష్టం

దెబ్బతిన్న పత్తి, వరి, సోయాబీన్‌ పంటలు

మళ్లీ విత్తనాలు వేసుకోవాల్సిందే అంటున్న రైతులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వారం రోజులకుపైగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో భారీ స్థాయిలో సాగు దెబ్బతింది. వేసిన విత్తనాలు కుళ్లిపోవడం, మొలకెత్తినచోట మొక్కలు కొట్టుకుపోవడం, దెబ్బతినడంతో.. సుమారు 10 లక్షల ఎకరాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. దీనితో రైతుల పెట్టుబడి కష్టం వర్షార్పణమైంది. అనధికార అంచనా ప్రకారం రైతులకు సుమారు రూ.500 కోట్ల మేర నష్టం వాటిల్లింది.

వానలు బాగా పడతాయని..: ఈ ఏడాది వర్షాలు బాగుంటాయన్న వాతావరణశాఖ అంచనాల మేరకు 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. రైతులు కూడా జూన్‌ రెండో వారం నుంచే సాగు మొదలుపెట్టారు. వ్యవసాయశాఖ గణాంకాల ప్రకారమే.. ఇప్పటివరకు 53.79 లక్షల ఎకరాల్లో పలు రకాల పంటలు సాగయ్యాయి. పంటలన్నీ ప్రాథమిక దశలోనే ఉండటంతో భారీ వర్షాలకు, వరదలకు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పత్తి చేలలో నీరు నిలవడంతో విత్తనాలు భూమిలోనే కుళ్లిపోయాయి. మొలకస్థాయిలో ఉన్న పత్తి మునిగి దెబ్బతింది. వరినారు కొట్టుకుపోయింది. వానలు తెరిపినిచ్చినా పంట చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మళ్లీ పంట పెట్టుబడుల భారం మీద పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి వెంట భారీగా నష్టం: ప్రధానంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల, వాజేడు, వెంకటాపురం తదితర ప్రాంతాల్లో పంటలకు తీవ్రంగా నష్టం జరిగింది. గోదావరికి భారీ వరద రావడంతో.. నదికి రెండు పక్కలా ఒకట్రెండు కిలోమీటర్ల మేర పంటలను ముంచెత్తడంతో నదీ పరీవాహక ప్రాంతాల్లో పంటలపై ప్రభావం పడింది. 

నిజామాబాద్‌ జిల్లాలో 1.85 లక్షల ఎకరాల్లో, కామారెడ్డి జిల్లాలో సాగైన 1.89 వేల ఎకరాల్లో పావువంతు పంటలు మునిగిపోయాయి. పెద్దపల్లి జిల్లాలో 65వేల ఎకరాల్లో పంటలు సాగుకాగా 60 శాతం నీట మునిగాయి. భూపాలపల్లి జిల్లాలో 1.14 లక్షల ఎకరాల్లో, ములుగు జిల్లాలో 10 వేల ఎకరాలు వరద పాలయ్యాయి. వరంగల్‌ జిల్లాలో సాగైన 1.31 లక్షల ఎకరాలు, మహబూబాబాద్‌ జిల్లాలో 1.38 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది.

ఈ చిత్రంలో చెరువులా కనిపిస్తున్నది మంచిర్యాల జిల్లా వేమనపల్లికి చెందిన కౌలు రైతు చౌదరి శంకరయ్య సాగు చేస్తున్న చేను. ఆయన 12 ఎకరాలు కౌలు తీసుకుని పత్తి వేయగా ప్రాణహిత వరదలు చేనును ముంచెత్తాయి. పదెకరాల మేర పూర్తిగా నీట మునిగింది. ఎకరానికి రూ.18 వేల వరకు పెట్టుబడి పెట్టానని.. అంతా వరద పాలైందని శంకరయ్య వాపోయారు. మళ్లీ విత్తనాలు వేద్దామంటే పెట్టుబడికి సొమ్ము ఎక్కడి నుంచి తేవాలని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చదవండి: గోదావరి మహోగ్ర రూపం.. రంగంలోకి హెలికాప్టర్లు.. సైన్యం

మరిన్ని వార్తలు