ఏడో ప్రపంచ రికార్డు కోసం థీమ్‌.. ఒకేచోట 500కు పైగా వంటకాలు

24 Dec, 2022 02:33 IST|Sakshi

సనత్‌నగర్‌ (హైదరాబాద్‌): తెలంగాణ సకినాలు.. ఆంధ్రా ఉలవచారు.. తమిళనాడు చికెన్‌ చెట్టినాడ్‌.. కేరళ ఇడియ­ప్పం.. బెంగాలీ రసగుల్లా.. గుజరాతీ దోక్లా.. రాజస్తానీ పాపడ్‌ కీ సబ్జీ.. ఒకటా రెండా.. దేశంలోని 28 రాష్ట్రాలు.. ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాల రుచులు అక్కడ ఘుమ­ఘుమలాడాయి. 500 పైచి­లుకు వంటకాలు ప్రదర్శనలో నోరూరించారు. ప్రపంచ రికార్డులో భాగంగా అన్ని రాష్ట్రాల వంటకా లను తయారు చేసి ప్రదర్శించారు.

బేగంపేట ఉమానగర్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా విద్యార్థులు శుక్రవారం ఆయా రాష్ట్రాల వంటకాలను  ఇండియా మ్యాప్‌ ఆకృతిపై ప్రదర్శించారు. గతంలో వివిధ అంశాల్లో ఆరు ప్రపంచ రికార్డులు సొంతం చేసుకున్న కలినరీ అకాడమీ ఆఫ్‌ ఇండియా ఈసారి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ‘ఇండియా ఆన్‌ థాలి’ పేరిట ఏడో ప్రపంచ రికార్డు కోసం ఈ థీమ్‌ను ఎంచుకుంది. ఆయా రాష్ట్రాల వస్త్ర ధారణలో విద్యార్థులు ఆకట్టుకు న్నారు.  

మరిన్ని వార్తలు