ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా.. ఇంతలోనే విధి వక్రించి

1 Aug, 2021 14:18 IST|Sakshi

ఆత్మకూర్‌ (ఎస్‌)(సూర్యాపేట) : మరో పక్షం రోజులు గడిస్తే.. ఆ ఇంట పెళ్లి బాజాలు మోగనుండగా.. ఇంతలోనే విధి వక్రించి విషాదఛాయలు అలుముకున్నాయి.. వివరాలలోకి వెళ్తే .. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) రామన్నగూడెం గ్రామానికి చెందిన అనంతుల మల్లయ్య (52)కు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. కుమార్తెకు వివాహం కాగా, ఇటీవల కుమారుడు మహేష్‌కు నిశ్చితార్థం జరిగింది. 

శ్రావణమాసంలో ముహూర్తం పెట్టుకోవాల్సి ఉంది. ఈ పెళ్లికి వంట చెరుకు సమకూర్చేందుకు అనంతుల మల్లయ్య శనివారం ఉదయాన్నే ఓ రైతుకు చెందిన ఎడ్లబండి, మరో రైతు ఎడ్లను తోలుకుని గ్రామ శివారులోని ఏరు అవతలికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో ఏరు దాటలేకపోయాయి.  ఈ సమయంలో ఏటిలోంచి పొలానికి నీళ్లు పెట్టుకునేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన విద్యుత్‌ మోటార్‌కు సంబంధించి సర్వీస్‌ వైర్‌ ప్రమాదవశాత్తు ఎడ్ల బండికి తగిలింది. ఈ ప్రమాదంలో అనంతుల మల్లయ్యతో పాటు ఓ ఎద్దు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలువిడిచింది. గమనించిన సమీపంలో ఉన్న రైతు సంబంధిత శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు.

 విషయం తెలుసుకున్న సూర్యాపేట రూరల్‌ సీఐ విఠల్‌రెడ్డి, ఎస్సై లింగం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లింగం తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు