ఘోర రోడ్డు ప్రమాదం.. కేసీఆర్‌ దిగ్ర్భాంతి

29 Jan, 2021 13:24 IST|Sakshi

గూడూరు: మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ - ఆటో ఢీకొనడంతో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. గూడూరు మండలం మర్రిమిట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. మృతులంతా గూడూరు మండలం ఎర్రకుంట్ల తండాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారు. దుస్తుల కొనుగోలు కోసం వరంగల్‌కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. వారు ప్రయాణిస్తున్న ఆటో గూడూరు శివారుకు చేరుకోగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.

దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. అందులో ప్రయాణిస్తున్న వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుల్లో ఇటీవల పెళ్లి కుదిరిన యువతి కూడా ఉన్నట్టు తెలిసింది. ఆమె పెళ్లికి బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం. కాగా, ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు హామీ ఇచ్చారు.లారీ కింద కూరుకుపోయిన ఆటోను పోలీసులు అతికష్టమ్మీద బయటకు తీశారు. లారీని ప్రొక్లెయిన్‌తో పక్కకు నెట్టారు. అయితే ప్రమాదానికి లారీ అతివేగంగా రావడమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు