కేసీఆర్‌ తాతయ్యా.. న్యాయం చేయరూ..!

4 Nov, 2020 08:13 IST|Sakshi

ఆస్తి కోసం సిరిసిల్లకు పసివాడి పాదయాత్ర

కబ్జా చేసిన మాజీ ప్రజాప్రతినిధి

పట్టించుకోని అధికారులు

సిరిసిల్ల కలెక్టరేట్‌లో ఫిర్యాదు

సాక్షి, సిరిసిల్ల టౌన్‌: ‘‘మోదీ తాతయ్యా.. కేసీఆర్‌ తాతయ్యా.. నా మొర ఆలకించండి.. మూడేళ్లుగా నా ఆస్తిని ఓ ప్రజాప్రతినిధి కబ్జా చేశాడు. కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. మీరైనా స్పందించి న్యాయం చేయరూ ప్లీజ్‌..’’ అంటూ ఓ ఆరేళ్ల పసివాడు వేడుకుంటున్నాడు. బాధితుల కథనం ప్రకారం.. సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్‌ మండలం లింగంపల్లికి చెందిన కుమారస్వామి, మమత దంపతులు 2017లో అనారోగ్యంతో చనిపోయారు. వీరికి కుమారుడు నాగప్రణీత్‌ (6) ఉన్నాడు. మమతకు తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన 1.16 ఎకరాల భూమి సర్వే నంబర్‌ 108/17, 33/6లో ఉంది. చదవండి: రాబోయే మూడు నెలలు జాగ్రత్త 

ఈ భూమిని కౌలుకు తీసుకున్న ఓ మాజీ ప్రజాప్రతినిధి.. మమత, కుమారస్వామి చనిపోయేవరకు కౌలు చెల్లించాడు. అయితే వాళ్లిద్దరూ చనిపోయాక, కొద్ది రోజుల క్రితం ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లో తన పేరిట మార్పించుకున్నాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ లింగంపల్లి నుంచి సిరిసిల్ల కలెక్టరేట్‌ వరకు మంగళవారం నాగప్రణీత్‌ తన తాత రాజయ్యతో కలిసి పాదయాత్ర చేశాడు. ఈ విషయంపై గతంలోనే రెండు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ విచారణకు ఆదేశించినా.. ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు స్పందించడం లేదని బాధితులు తెలిపారు. కలెక్టర్‌ స్పందించి సరైన న్యాయం చేయాలని వేడుకుంటూ మంగళవారం కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. చదవండి: వాసాలమర్రిని దత్తత తీసుకున్న కేసీఆర్‌

మరిన్ని వార్తలు