అమ్మానాన్నకు చెప్పొద్దు ప్లీజ్‌!

6 Jan, 2023 04:09 IST|Sakshi

ఆరేళ్ల కేన్సర్‌ బాధిత బాలుడి అభ్యర్థన

బాలుడి పరిణతికి విస్తుపోయిన వైద్యుడు

చివరి రోజులు సంతోషంగా గడిపేలా చూడండంటూ సూచన

ఇటీవలే మృతి చెందిన బాలుడు

ట్విట్టర్‌లో జ్ఞాపకాలు పంచుకున్న డాక్టర్‌ సుధీర్‌

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని వ్యాధులతో మరణం తప్పదని తెలిసినా ఆ విషయం బాధితులకు తెలియకూడదని కుటుంబీకులు, ఒక్కోసారి తమవారికి తెలియకూడదని బాధితులూ అనుకోవడం సహజమే. అయితే తాను చనిపోతా నని తన తల్లిదండ్రులకు తెలీకూడదని ఓ ఆరేళ్ల చిన్నారి అనుకోవడమే ఆశ్చర్యం. మనసును మెలిపెట్టేస్తున్న ఉదంతం. నగరానికి చెందిన న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ సుధీర్‌ చిన్నారి పేషెంట్‌తో తన జ్ఞాపకాలను సోషల్‌ మీడియాలో పంచుకుని నెటిజనుల మనసుల్ని ద్రవింపజేశా రు. సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు.

ఏకాంతంగా మాట్లాడాలన్నాడు..
‘మను (పేరు మార్చాం)కి ఫిట్స్‌ వస్తున్నాయని ఓ ఆంకాలజిస్ట్‌ నా దగ్గరకు రిఫర్‌ చేశారు. అతని మెడికల్‌ రికార్డులు చూశాక మను మెదడుకు ఎడమ వైపు గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మ్‌ గ్రేడ్‌ 4 కేన్సర్‌తో బాధపడుతున్నాడని, దాని కారణంగా చిన్నారి కుడి చేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయని తెలిసింది. ఏడెనిమిది నెలల క్రితం నా క్లినిక్‌లో మను తల్లిదండ్రులైన యువ జంటను కలిశాను. తమ బిడ్డ మనుకి క్యాన్సర్‌ ఉందని అయితే ఆ విషయం తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియనివ్వద్దని ఆ జంట నన్ను అభ్యర్థించారు.

ఇలాంటి అభ్యర్థనలు మామూలే కాబట్టి సరే అని, ఆ తర్వాత వీల్‌ చైర్‌లో నా ఛాంబర్‌లోకి ప్రవేశించిన మనుని కలిశా. ఆ సందర్భంగా డాక్టర్‌తో ఏకాంతంగా మాట్లాడాలనుకుంటున్నా అని మను తన తల్లిదండ్రులను కోరడం నన్ను ఆశ్చర్య పరచింది. తర్వాత తనకు క్యాన్సర్‌ ఉందనే విషయం తన తల్లిదండ్రులకు చెప్పవద్దని మను అభ్యర్థించడం నేను నివ్వెరపోయేలా చేసింది. 

ఉద్యోగాలు వదిలి..మనుతో కదిలి...
మళ్లీ కొన్ని రోజుల క్రితమే వారు నన్ను కలిశారు. గతంలో ఇద్దరం ఉద్యోగస్తులమైనందున బిడ్డతో తగినంత సమయం గడపలేకపోయామని, నేను ఇచ్చిన సలహా మేరకు ఇద్దరం ఉద్యోగాలు వదిలేశామని చెప్పారు. అర్ధరాత్రి ఐస్‌క్రీమ్‌ తినిపించడం నుంచి, అమెరికాలో డిస్నీల్యాండ్‌ చూపించడం దాకా.. మను ఇష్టాలు, కోరికలు తీర్చడమే పనిగా ఆ సమయం అంతా గడిపామన్నారు. ఆర్నెల్లూ ముగ్గురం ఒకటిగా బ్రతికామని తెలిపారు. ఇటీవలే ఒకరోజు తీవ్రమైన తలనొప్పితో బాధపడిన మను తమని వదిలేసి వెళ్లిపోయాడని, ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటూ..మనుతో గడిపిన చివరిరోజుల్ని మర్చిపోలేని జ్ఞాపకాలుగా మలచుకోవడానికి కారణమైన మీకు థ్యాంక్స్‌ చెప్పడానికి వచ్చామని చెప్పారు.  

మను లేడు కానీ..
మను లేడు.. కానీ చిన్న వయస్సులోనే అతని గొప్ప మనసు మనతోనే ఉంది. చనిపోతానని తెలిసి కూడా తల్లిదండ్రుల్ని బాధ పెట్టకూడదనుకుంటూ చిన్నారి చెప్పిన మాటలు మన స్మృతులలో నిలిచే ఉంటాయి. పెద్దవాళ్లయినా, చిన్నవాళ్లయినా మరణం తప్పదని తెలిసినప్పుడు దాగుడు మూతలు ఆడడం కంటే.. ఆ నిజాన్ని అందరూ అంగీకరించి చివరి రోజుల్ని సంతోషంగా గడిపేలా చూడడం ముఖ్యం..’ అంటూ ముగించారు డా.సుధీర్‌ కుమార్‌. 

ఐప్యాడ్‌లో చదివి...
‘ఐప్యాడ్‌లో గూగుల్‌ సెర్చ్‌ చేసి నా వ్యాధి గురించి  చదివా. నేను 6 నెలలే జీవిస్తానని తెలుసు, కానీ తట్టుకోలేరని నా తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పలేదు. వారికి నేనంటే చాలా ఇష్టం  దయచేసి వారితో చెప్పకండి..’ అన్న ఆ ఆరేళ్ల బాలుడి మాటలు విని కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయా. తర్వాత సరే అని అన్నా. అయితే ఆ విషయం అప్పటికే తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి.. వారికి మా మధ్య జరిగిన సంభాషణ సారాంశాన్ని వివరించా. వారు కూడా కొద్దిసేపు నిర్ఘాంతపోయారు. తర్వాత బాలుడి ఇష్టాఇష్టాలను తెలుసుకుని తీర్చడం ముఖ్యమని వారికి హితవు చెప్పా. ఆ తర్వాత కొన్ని నెలల దాకా ఆ జంట నన్ను కలవలేదు. 

మరిన్ని వార్తలు