ఆ విషాదానికి ఆరేళ్లు; మా కోరిక అదొక్కటే!

24 Jul, 2020 15:40 IST|Sakshi

తల్లిదండ్రులకు టాటా చెప్పి, అమ్మమ్మలకు బాయ్‌ చెప్పి పాఠశాల బస్సెక్కి బయల్దేరిన ఆ పసివాళ్లు తరలిరాని లోకాలకు వెళ్లారు. తమను తీసుకెళ్తున్న ఆ వాహనమే మృత్యు శకటమవుతుందని, అందరినీ విడిచి అనంత లోకాలకు వెళ్తున్నామని తెలియని ఆ పసిమనసులు తోటి మిత్రులతో ముచ్చటిస్తున్నారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. డ్రైవర్‌ నిర్లక్ష్యంతో కాపలా లేని రైల్వే క్రాసింగ్‌ దాటుతున్న వారి బస్సును అటువైపుగా వస్తున్న రైలు ఢీకొట్టడం, 16 మంది చిన్నారుల ప్రాణాలు గాల్లో కలిసిపోవడం క్షణాల్లో జరిగిపోయింది. సరిగ్గా ఇదే రోజు (జులై 24), ఆరేళ్ల క్రితం మాసాయిపేట వద్ద జరిగిన ఈ ఘటన నాలుగు గ్రామాల్లోని పద్దెనిమిది కుటుంబాల్లో తీరని విషాదం నింపిం‍ది. బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రులు ఈ దుర్దినాన్ని తలచుకుని కన్నీంటిపర్యంతమవుతున్నారు. ఎవరికీ ఇలాంటి పరిస్థితి రావొద్దని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మాసాయిపేట బస్సు ప్రమాదంపై సాక్షి ప్రత్యేక కథనం.

సాక్షి, మెదక్‌: మాసాయిపేట బస్సు ప్రమాదానికి నేటికి ఆరేళ్లు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట రైల్వే గేట్ వద్ద ఆరేళ్ల క్రితం ఇదే రోజు పాఠశాలకు బయల్దేరిన చిన్నారులను బస్సు ప్రమాదం బలితీసుకుంది. మాసాయిపేట కాపలా లేని రైల్వే గేటు వద్ద 34 మంది విద్యార్థులతో వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సు అకస్మాత్తుగా రైలు పట్టాలపై ఆగిపోయింది. అంతలోనే నిజామాబాద్ నుంచి అతి వేగంగా వచ్చిన నాందేడ్‌ రైలు ఢీకొని బస్సులో ఉన్న విద్యార్థుల్లో 13 మంది చిన్నారులు అక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. మరో 18 మంది చిన్నారులు ప్రభుత్వ చొరవతో కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యం పొంది ప్రాణాలతో బయటపడ్డారు.
(చదవండి: చైనాలో బ‌స్సు ప్ర‌మాదం..21 మంది మృతి)

కానీ ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారుల్లో కొందరు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. జ్ఞాపక శక్తి మందగించి కొందరు, కాళ్లు చేతులు వణకడం సమస్యలతో మరికొందరు ఇబ్బందులు పడుతున్నారు. ఇక చదువుకునేందుకు వెళ్లిన తమ బిడ్డలు అకాల మృత్యువాత పడటంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రభుత్వాలు ఎంత పరిహారం ఇచ్చినా తమ పేగు బంధం తెగిపోయిందని, ఇది జీవితాంతం వెంటాడుతూనే ఉంటుందని చెప్తున్నారు. తమలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులకు రాకూడదని కోరుకుంటున్నారు. దేశంలో ఎక్కడ కాపలా లేని రైల్వే గేట్లు ఉండరాదని కోరుకుంటున్నారు.
(చిన్న సాయం చేయండి.. తేజ్‌దీప్‌ను కాపాడండి)

మరిన్ని వార్తలు