గ్రామ జనాభా 1,400.. వారిలో 600 మందికి పాజిటివ్‌!

4 May, 2021 02:42 IST|Sakshi

ఊళ్లో వైరస్‌.. ఊరిబయట జనం 

ఎర్రవల్లిపై కరోనా పంజా  

దృష్టి సారించని యంత్రాంగం

సాక్షి, వికారాబాద్‌: ఊరంతా చిన్నబోయింది.. ఇళ్లన్నీ కళ తప్పాయి.. వీధులన్నీ బోసిపోయాయి.. వీధికుక్కలు మాత్రమే అక్కడక్కడా దర్శనమిస్తున్నాయి.. ఒకటీ, అరా ఇళ్ల ముందు వృద్ధులున్నారు. వారి ముఖాల్లో బోసినవ్వులు మాయమయ్యాయి.. పిల్ల లేరి అంటే పొలాల వైపు చూపిస్తున్నారు.. జనం పెద్ద పెద్ద బంగ్లాలను వదిలి బావుల దగ్గర చిన్న, చిన్న గుడిసెల్లో తలదాచుకుంటున్నారు.. వైరస్‌ ఊళ్లోకి వచ్చింది.. జనం ఊరిబయటకు తరలిపో యారు.. ఇదీ వికారాబాద్‌ మండలం ఎర్రవల్లి దయనీయస్థితి. కరోనా కరాళనృత్యానికి ఊరంతా చెల్లాచెదురైంది. చెట్టుకొకరు, పుట్టకొకరు అయ్యా రు. ఆ ఊరి జనాభా 1,400 మంది.. వారిలో సుమారు 600 మందికి కరోనా వైరస్‌ సోకింది. శ్వాస తీసుకునేందుకు ఇబ్బందిపడి వారం క్రితం ఇద్దరు మృతి చెందారు. దీంతో జనమంతా వెళ్లిపోయి తమ తమ వ్యవసాయ పొలాల వద్ద గుడిసెలు వేసుకొని క్వారంటైన్‌లో గడుపుతున్నారు. 

కలెక్టర్‌కు విన్నవించినా... 
గ్రామంలో హెల్త్‌ క్యాంపు ఏర్పాటు చేసి అందరికీ టెస్టులు చేయాలని ఇటీవల గ్రామానికి వచ్చిన కలెక్టర్‌కు విన్నవించారు. అయినా ఎలాంటి స్పందన లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజూ ఒక ఏఎన్‌ఎం మాత్రం గ్రామానికి వచ్చి వెళ్తోందని చెబుతున్నారు. కరోనాతో చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాకపోవడంతో కోఆప్షన్‌ మెంబర్‌ జాఫర్‌ జేసీబీల సాయంతో గుంతలు తవ్వించి మృతదేహాలను పూడ్చివేయిస్తున్నారు. ఒకవేళ దొంగలు ఊరి మీదపడి దోచుకుపోయినా అడిగే నాథుడులేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

హెల్త్‌క్యాంపు పెట్టాలి 
హెల్త్‌ క్యాంపు పెట్టి ప్రతిఒక్కరికీ టెస్టులు చేయాలని పదిరోజుల క్రితం కలెక్టర్‌ను కోరాం. ఎమ్మెల్యే ఆనంద్‌కు కూడా సమాచారం ఇచ్చాం. జనం ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. గ్రామాన్ని ఆదుకోవాలి. 
– జాఫర్, కోఆప్షన్‌ మెంబర్, ఎర్రవల్లి  

నా కళ్ల ముందే నాన్న ప్రాణం పోయింది 
మా నాన్నకు కరోనా పాజిటివ్‌ తో హోం ఐసోలేషన్‌లో ఉన్నా డు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడితే అంబులెన్స్‌లో గచ్చిబౌలి టిమ్స్‌కు తీసుకెళ్లాం. ఆక్సిజన్‌ పూర్తవుతోందని డాక్టర్లకు చెప్పినా పట్టించుకోలేదు. మా నాన్న ప్రాణం నా కళ్ల ముందే పోయింది.      – హర్షవర్ధన్‌రెడ్డి, ఎర్రవల్లి 

సగం మంది ఆగం 
గ్రామంలో సగం మందికి కరోనా వచ్చింది. ఊరు విడిచి పొలాల్లో ఉంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులేమో పట్టించుకోవడం లేదు. గ్రామంలో ఎప్పుడు, ఎవరు చనిపోతారోనని భయపడుతున్నాం. మమ్మల్ని ఎవరూ పట్టించుకోరా.. మా బతుకు ఇంతేనా..? చావాల్సిందేనా!      – శ్రీశైలం ముదిరాజ్, ఎర్రవల్లి  

మరిన్ని వార్తలు