Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్‌ ఎందుకు?

26 Nov, 2021 05:01 IST|Sakshi

టీచర్‌ వృత్తిపై తగ్గుతున్న ఆసక్తి 

నాలుగేళ్లలో వందకుపైగా డీఎడ్‌ కళాశాలల మూత 

6 వేల సీట్లున్నా సగానికిపైగా ఖాళీనే..  

సాక్షి, హైదరాబాద్‌: కొన్నేళ్ల క్రితం వరకూ డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌ (డీఎడ్‌) సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్లి మరీ డీఎడ్‌ తత్సమానమైన కోర్సులు చేసేవాళ్లు. డీఎడ్‌ చేస్తే ఉపాధ్యాయ పోస్టు (ఎస్‌జీటీ) గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువ సీట్లు ఉంటున్నాయి.. చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో డీఎడ్‌ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.

నాలుగేళ్లలో 112 కాలేజీలు మూతపడ్డాయంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఇదే ట్రెండ్‌ కొనసాగితే డీఎడ్‌ కోర్సు ఉండే అవకాశమే లేదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. డీఎడ్‌ నాణ్యత పెంచడంతోపాటు, కోర్సు చేస్తే ఉపాధి వస్తుందనే భరోసా ఉండాలంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ సంఖ్య పెంచడంతోపాటు, ప్రైవేటు స్కూళ్లలోనూ ఈ అర్హత ఆధారంగా ఉద్యోగాలు దక్కినప్పుడే ఈ కోర్సు ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. 

మూతపడుతున్న కాలేజీలు 
ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్‌ కాలేజీలున్నాయి. ఇందులో పది ప్రభుత్వ అధీనంలోనివి. మిగతావి ప్రైవేటులో  కొనసాగుతున్నాయి. ఇప్పుడు డీఎడ్‌ కాలేజీలు వందకు పడిపోయాయి. మరిన్ని మూసివేతకు సిద్ధమవుతున్నాయి. కోర్సుల్లో చేరే వాళ్లూ తగ్గుతు న్నారు. 2017–18లో 11,500 సీట్లుంటే, 7,650 మందే చేరారు. 2020–21 నాటికి ఈ సంఖ్య ఇంకా పడిపోయింది. 6,250 సీట్లున్నా 2,828 మందే చేరారు. కొన్ని కాలే జీల్లో 20 మంది కూడా చేరలేదు.

కారణాలేంటి? 
యాజమాన్య కోటా కింద ప్రతీ కాలేజీకి పది సీట్లుంటాయి. కన్వీనర్‌ కోటా కిందే భర్తీ కానప్పుడు యాజమాన్య కోటా కింద చేరే ప్రసక్తే ఉండదు. కన్వీనర్‌ కోటా కింద ప్రభుత్వం ఏటా రూ.11 వేల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద, రూ. 1,500 ఇతర ఖర్చుల కింద కాలేజీలకు ఇస్తుంది. ఇవి సమయానికి అందడం లేదని, దీంతో కాలేజీల నిర్వహణ కష్టమవుతోందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అధ్యాపకులకు వేతనాలు చెల్లించడమే కష్టంగా ఉందని అంటున్నాయి.

దీనికితోడు బీఎడ్‌ చేసిన వారికే ఉపాధి కష్టంగా ఉందని, డీఎడ్‌ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. పైగా కరోనా తర్వాత  ప్రైవేటు స్కూళ్లు ఉపాధ్యాయులకు వేతనాలు అరకొరగా చెల్లిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ టీచర్ల నియామకం జరగలేదు. ఈ కోర్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందని నిపుణులు అంటున్నారు.   

మరిన్ని వార్తలు