ఎయిడ్స్‌ భూతాన్ని వదిలేశారు!

15 Dec, 2022 09:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎయిడ్స్‌ వ్యాధి నిర్ధారణ ప్రక్రియ అటకెక్కింది. వైద్య,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా చేయా ల్సిన నిర్ధారణ పరీక్షలు, స్క్రీనింగ్‌ పరీక్షలను అడపాదడపా చేస్తూ చేతులు దులుపుకుంటోంది. శస్త్రచికిత్సల సమయంలో చేసే నిర్ధారణ పరీక్షలు మినహా ప్రత్యేక క్యాంపులతో బాధితుల గుర్తింపు కార్యక్రమాలకు వైద్య,ఆరోగ్య శాఖ దాదాపు మంగళం పాడింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో చేపడుతున్న నిర్ధారణ పరీక్షల్లో బాధితులను గుర్తించి ప్రభుత్వ కేంద్రాలకు సమాచారం ఇస్తున్నప్పటికీ అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఈ ఏడాది గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో 1,55,882 మంది ఎయిడ్స్‌ బాధితులున్నారు. వీరికి క్రమం తప్పకుండా మందులు పంపిణీ చేస్తూ... అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యపర్చాలి. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించిన ఎయిడ్స్‌ రోగులకు కనీసం మందులు సైతంపంపిణీ చేయలేదు. ఇప్పటివరకు కేవలం 87,217 బాధితులకు మందులు పంపిణీ చేస్తుండగా... మిగతా 68665 మంది జాడ గుర్తించలేకపోవడం గమనార్హం. 

ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కొత్త కేసుల గుర్తింపు... 
ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 1272 ఎయిడ్స్‌ బాధితులను వైద్యులు గుర్తించారు. వీరంతా ప్రైవేటు ఆస్పత్రుల్లో చేపట్టిన నిర్ధారణ పరీక్షల్లో వెలుగులోకి వచి్చన వారే. వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌లో 165, రంగారెడ్డి జిల్లాలో 79, నల్లగొండలో 69 చొప్పున నమోదయ్యాయి. శస్త్రచికిత్సల సమయంలో నిర్వహించే పరీక్షల్లోనే ఇంత పెద్ద మొత్తంలో బాధితులు గుర్తించడం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, క్లస్టర్‌ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ప్రత్యేకంగా ఐసీటీసీ(ఇంటిగ్రేటెడ్‌ కౌన్సెలింగ్‌ అండ్‌ టెస్టింగ్‌ సెంటర్‌)లున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా 187 ఐసీటీసీ, 865 ఎఫ్‌ఐసీటీసీ కేంద్రాలున్నాయి. ప్రత్యేక క్యాంపులు నిర్వహించి బాధితులను గుర్తించి వారికి అవగాహన కల్పించడం, మందులు పంపిణీ చేయడం ఈ సెంటర్ల ముఖ్య ఉద్దేశం. కానీ ఈ కేంద్రాల పనితీరు అంతంత మాత్రంగానే ఉంది. ఈ కేంద్రాల్లో ఈ ఏడాది గుర్తించిన బాధితుల సంఖ్య అధికారులు వెల్లడించడం లేదు. ప్రైవేటు కేంద్రాల్లో నమోదవుతున్న బాధితులు ప్రభుత్వ కేంద్రాల్లో మందులు తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈక్రమంలో బాధితులు ఎలాంటి మందులు వినియోగించకపోవడం ఆందోళన కలింగించే విషయం.  

మరిన్ని వార్తలు