మే నాటికే దేశంలో 65 లక్షల మందికి కరోనా

14 Sep, 2020 04:22 IST|Sakshi

సెరో పాజిటివిటీలో 82.8 శాతం మంది 60 ఏళ్లలోపు వాళ్లే

17.2 శాతమే 60 ఏళ్లు పైబడినవాళ్లు

దేశంలో కేసుల డిటెక్షన్‌ తక్కువ అవుతున్నట్టు నిర్ధారణ

జీరో కేసులున్న 233 జిల్లాల్లోనే 8.5 లక్షల కేసులు

ఐసీఎంఆర్‌ తొలి నేషనల్‌ సెరో సర్వేలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్: దేశంలో గత మే నాటికే కరోనా కరాళనృత్యం చేస్తోందని.. అప్పటికే 64,68,388 మంది (జనాభాలో 0.73 శాతం) కరోనా బారిన పడినట్లు తాజా సర్వే చెబుతోంది. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ‘సెరో సర్వే’పేరుతో ఈ అధ్యయనం నిర్వహించింది. గత మే 11 నుంచి జూన్‌ 4 మధ్య కాలంలో 28 వేల మందిపై జాతీయస్థాయిలో తొలిసారిగా ఈ సర్వే నిర్వహించింది. వీరి రక్త నమూనాలు సేకరించి కోవిడ్‌ కవచ్‌ ఎలీసా టెస్ట్‌ కిట్‌ ద్వారా వారి రక్తంలో ఐజీజీ యాంటీబాడీస్‌ను పరీక్షించారు. ‘సెరో ప్రివలెన్స్‌’తక్కువగా ఉన్నట్లు.. మే నెల మధ్యకల్లా జనాభాలో ఒక శాతం కంటే తక్కువ జనాభా మాత్రమే దీంతో ప్రభావితమైనట్లు ఈ సర్వేలో వెల్లడైంది. దేశంలోని అధిక జిల్లాల్లో ఇది తక్కువగా వ్యాప్తి చెందడాన్ని బట్టి కోవిడ్‌ మహమ్మారి ఇంకా ప్రారంభ దశలో ఉందని, ముందు ముందు మెజారిటీ ప్రజలు ఇంకా వైరస్‌ బారిన పడే అవకాశాలున్నట్టుగా ఈ సర్వే నివేదిక నొక్కి చెబుతోంది. దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు రిపోర్ట్‌ కాని లేదా స్వల్పసంఖ్యలో నమోదవుతున్న జిల్లాలు, ప్రాంతాల్లో అనుమానిత కేసుల వెలికితీతకు మరింత నిఘాతో పాటు టెస్టింగ్‌ల సంఖ్యను పెంచాల్సిన అవసరాన్ని ఐసీఎంఆర్‌ సర్వేతో స్పష్టం చేసింది. కాగా, తొలిసారిగా జాతీయస్థాయిలో ఐసీఎంఆర్‌ నిర్వహించిన సెరో సర్వేలో వెల్లడైన అంశాలను ఇండియన్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌లో ప్రచురించారు.

ప్రతీ నిర్ధారణ కేసుకు 82–130 కోవిడ్‌ ఇన్ఫెక్షన్లు...
‘సెరో ప్రివలెన్స్‌’0.73 శాతంతో రిపోర్ట్‌ అయిన కోవిడ్‌ కేసులను మొత్తంగా సర్దుబాటు చేసినపుడు (ఒవరాల్‌ అడ్జస్టెట్‌ సెరో ప్రివలెన్స్‌) ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్ట్‌తో నిర్ధారణ అయిన ప్రతీ కేసుకు దేశంలో 82–130 కోవిడ్‌ ఇన్ఫెక్షన్లు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లోని 30,283 కుటుంబాలను కలుసుకోగా, ఇందులో పాల్గొనేందుకు 28వేల మంది అంగీకరించినట్టు ఈ నివేదిక వెల్లడించింది. ఇందులో భాగస్వాములైన వారిలో 48.5 శాతం మంది 18 నుంచి 45 ఏళ్లలోపువారు. వీరిలో 51.5 శాతం మంది మహిళలు. లేబొరేటరీలు అందుబాటులో లేకపోవడం లేదా తక్కువ స్థాయిలో పరీక్షల కారణంగా కొన్ని జిల్లాల్లో కేసుల డిటెన్షన్‌ తక్కువ ఉండొచ్చునని సర్వే చెబుతోంది. 

జీరో కేస్‌ జిల్లాల్లో 8.56 లక్షల కేసులు
మే నెలలో సర్వే నిర్వహించేనాటికి జీరో కేస్‌ భావిస్తున్న 233 జిల్లాల్లో అత్యధికంగా 8.56 లక్షల కేసులున్నట్లుగా ఈ అధ్యయనంలో వెల్లడైంది. దేశంలో తొలి కరోనా కేసు రిపోర్ట్‌ అయిన 2 నెలల తర్వాత మొత్తం కేసుల్లో 13 శాతం ఈ జిల్లాల్లోనే ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే వ్యాప్తి తక్కువగా ఉందని భావిస్తున్న జిల్లాల్లో 18.17 లక్షల కేసులు, మధ్యస్థం అనుకుంటున్న జిల్లాల్లో 15.18 లక్షల కేసులు, అత్యధికం అని భావిస్తున్న జిల్లాల్లో 22.76 లక్షల కేసులున్నట్లు ఈ సర్వే పేర్కొంది. 

18–45 ఏళ్ల మధ్యలో అత్యధికం
సెరో పాజిటివిటీ 18–45 ఏళ్ల మధ్యలోనున్న వారిలో అధికంగా 43.3 శాతం, 46–60 ఏళ్ల మధ్యనున్న వారిలో 39.5 శాతం, అత్యల్పంగా 60 ఏళ్లకు పైబడిన వారిలో 17.2 శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. అంటే 60 ఏళ్లలోపు 82.3 శాతం మందిలో సెరో పాజిటివిటీ ఉన్నట్టు వెల్లడైంది. రాబోయే రోజుల్లో పరిస్థితి చేయి దాటకుండా వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రత్యేక కంటైన్‌మెంట్ల ఏర్పాటుతో పాటు లక్షణాలున్న వారందరికీ పరీక్షల నిర్వహించాలని సూచించింది. పాజిటివ్‌ వచ్చిన వారిని ఐసోలేట్‌ చేయడం, హైరిస్ట్‌ కాంటాక్ట్‌ల ట్రేసింగ్‌ వంటి చర్యలను చేపట్టాల్సి ఉంటుందని ఈ అధ్యయనం స్పష్టంచేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు