సేంద్రియ సాగుబాట.. దేశంలో ఆర్గానిక్‌ ఫార్మింగ్‌వైపు రైతుల అడుగులు 

26 Feb, 2023 02:54 IST|Sakshi

ప్రస్తుతం 66 లక్షల ఎకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం 

ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు కల్పిస్తే మొగ్గు చూపనున్న మరింత మంది అన్నదాతలు 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: సేంద్రియ వ్యవసాయం.. ఇప్పుడు ఈ పదం పంటల సాగులో ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకాలం అధిక దిగుబడి ఆశతో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడిన రైతులు దానివల్ల భూమి నిస్సారంగా మారడమే కాకుండా భూగర్భ జలాలు కలుషితమవడం, పురుగుమందుల అవశేషాలున్న పంట ఉత్పత్తులను ఆహారంగా వినియోగిస్తూ ప్రజలు అనారోగ్యం బారినపడుతున్నారని క్రమంగా గుర్తిస్తున్నారు. నెమ్మదిగా మళ్లీ సేంద్రియ సాగువైపు మళ్లుతున్నారు. 

బుడిబుడి అడుగులు.. 
దేశంలో ప్రస్తుతం 39.4 కోట్ల ఎకరాల వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది. అందులో వ్యవసాయం చేస్తున్న భూమి 21.5 కోట్ల ఎకరాలు ఉంది. ఇందులో 66 లక్షల ఎకరాల్లో మాత్రమే సర్టిఫైడ్‌ ఆర్గానిక్‌ సాగు జరుగుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అంటే పూర్తి సాగు విస్తీర్ణంలో సేంద్రియ సాగు కేవలం 3.24 శాతమేనన్నమాట. అయినప్పటికీ గత కొన్నేళ్లతో పోలిస్తే సేంద్రియ సాగు దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయని అర్థమవుతోంది. సర్టిఫికేషన్‌ లేకుండా సేంద్రియ సాగు చేస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఈ విస్తీర్ణం దాదాపు సర్టిఫైడ్‌ సేంద్రియ సాగు కంటే ఏడెనిమిది రెట్లు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  

ఆదర్శంగా సిక్కిం.. 
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన సిక్కిం చిన్న రాష్ట్రమే అయినా.. సేంద్రియ వ్యవసాయాన్ని చేస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ఆ రాష్ట్ర రైతులకు ప్రోత్సాహకాలు కల్పించడంలో అక్కడి ప్రభుత్వం ముందంజలో ఉండడమేకాక... వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే యత్నం చేస్తోంది. దేశంలో మొట్టమొదటి పూర్తి సేంద్రియ సాగు (ఆర్గానిక్‌ ఫామింగ్‌) సర్టిఫికేషన్‌ పొందిన రాష్ట్రం కూడా సిక్కిం ఒక్కటే కావడం విశేషం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సేంద్రియ వ్యవసాయ రైతులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించడంపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా ప్రధాన దేవాలయాలకు సరఫరా చేసే ఆహారపదార్థాలను సేంద్రియ సాగు ద్వారా పండించినవే వినియోగించేలా ముందుకు సాగుతోంది. 

మధ్యప్రదేశ్‌ అగ్రస్థానం.. 
సేంద్రియ సాగుపై రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తున్నాయి. ప్రస్తుతం విస్తీర్ణపరంగా చూస్తే మధ్యప్రదేశ్, రాజస్తాన్, మహారాష్ట్ర తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఏపీ సైతం గత రెండేళ్లుగా దీనిపై ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తోంది. భారీగా రైతులు సేంద్రియ సాగువైపు మళ్లేలా ప్రణాళికలు అమలు చేస్తోంది. ఏపీలో దాదాపు 10 శాతం మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఆరేడు లక్షల ఎకరాల వరకు సేంద్రియ సాగు జరుగుతున్నట్లు అంచనా. సేంద్రీయ వ్యవసాయంలో అనుభవం గడించిన వారితోనే మిగిలిన రైతాంగానికి శిక్షణ ఇప్పిస్తుండటంతో రైతులు ఆకర్షితులు అవుతున్నారు. గుజరాత్, హరియాణా కూడా సేంద్రియం వైపు వడివడిగా అడుగులేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలు తమ దగ్గర సాగైన సేంద్రియ పంటలను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నాయి.  

సేంద్రియ ఉత్పత్తుల విలువ రూ.14,800 కోట్లు 
దేశంలో సాగవుతున్న సేంద్రియ ఉత్పత్తుల మొత్తం విలువ రూ.14,800 కోట్లు. ఇందులో విదేశాలకు దాదాపు రూ.11,500 కోట్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అవుతుండగా.. రూ.2వేల కోట్ల విలువైన ఉత్పత్తులు రిటైల్‌ మార్కెట్లకు వెళుతున్నాయి. మిగిలిన ఉత్పత్తులను రైతులు నేరుగా విక్రయించుకుంటున్నారు. 

ఎందుకు ఈ సేంద్రియం..? 
సేంద్రియ సాగుతో ప్రధానంగా రైతులు చేసే వ్యయం గణనీయంగా తగ్గుతుంది. సంప్రదాయ వ్యవసాయంతో వచ్చే ఆదాయం కంటే కూడా సేంద్రియ వ్యవసాయంతో లాభాలు ఎక్కువ. దీనికితోడు పొలాలు సారవంతం కావడం, భూగర్భ జలాలు కలుషితం కావు. సేంద్రియ సాగుతో అటు ప్రకృతికి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుంది. అయితే దేశంలోని రైతులంతా సేంద్రియ సాగు బాట పట్టేలా అడుగులేయడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వాలు కూడా సేంద్రియ సాగు వైపు రైతులను మళ్లించడానికి వీలుగా తగిన ప్రోత్సాహకాలు కల్పించాల్సిన అవసరం ఉంది. 

రైతుకు నమ్మకం కలిగిస్తున్నాం.. 
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి వ్యవసాయంపై నమ్మకం కలిగించేలా చర్యలు చేపట్టాం. 2030–31 నాటికి రాష్ట్రంలోని రైతులంతా ప్రకృతి సాగు వైపు మళ్లించాల­న్నది ప్రభుత్వ లక్ష్యం. రైతు భరోసా కేంద్రాలే ప్రకృతి సాగుపై శిక్షణ ఇచ్చే కార్యాలయాలు. రైతులు ఒకేసారి మారాలంటే మారరు. అందుకు ఓపికగా వారిని మార్చడానికి ప్రయత్నించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెబుతున్నారు.

అలా రైతులను ఒప్పించడం వల్లే 10 శాతం మంది సేంద్రియ సాగువైపు మళ్లారు. సాధారణ ఉత్పత్తుల కంటే ఆర్గానిక్‌ ఉత్పత్తులకు 10 శాతం అధిక ధరలు లభిస్తున్నా­యి. మధ్యప్రదేశ్, మేఘాలయ, రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల నుంచి రైతు­లు ఏపీలో అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయడానికి వస్తున్నారు. 
– విజయ్‌కుమార్‌ ఐఏఎస్, ఏపీ రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ 

ప్రపంచంలోనే ఎక్కువ మంది రైతులు మన దగ్గరే..  
సేంద్రియ వ్యవసాయం చేస్తున్న వారిలో ప్రపంచంలో అత్యధిక రైతులు భారత్‌లోనే ఉన్నారు. వారికి సరైన మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే ఎక్కువ మంది ఈ సాగుపట్ల మొగ్గు చూపుతారు. ప్రభుత్వాలు దీనిపై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. సేంద్రియ సాగు సర్టిఫికేషన్‌పై రైతుల్లో ఇంకా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 
– సీవీ రామాంజనేయులు, సుస్థిర వ్యవసాయ కేంద్రం ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌  

మరిన్ని వార్తలు