పుట్టు వెంట్రుకలు కార్యక్రమంలో పుట్టెడు విషాదం..

3 Apr, 2021 01:29 IST|Sakshi
గోదావరిలో ప్రమాదం జరిగిన ప్రదేశం ఇదే..

ఎస్సారెస్పీ దిగువన వీఐపీ పుష్కరఘాట్‌ వద్ద దుర్ఘటన

నలుగురు మునిగిపోతుండగా.. కాపాడేందుకు వెళ్లిన ముగ్గురు

ఒకరిని కాపాడిన స్థానికుడు.. 2 కుటుంబాల్లో తండ్రీకొడుకులు మృతి

మృతులంతా సమీప బంధువులే.. ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి  

బాల్కొండ: గోదావరి నదీ తీరం శోఖ సంద్రమైంది.. నదీమ తల్లికి పుట్టు వెంట్రుకలు సమర్పించుకునే శుభకార్యానికి హాజరైన కుటుంబాలు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయాయి.. గోదావరి నదిలో మునిగి ఆరుగురు మృత్యువాత పడ్డారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్‌ వీఐపీ పుష్కరఘాట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్‌ నగరంలోని ఎల్లమ్మగుట్టకు చెందిన బొబ్బిలి శ్రీనివాస్‌ (40) ఆయన ఇద్దరు కుమారులు బొబ్బిలి సిద్ధార్థ (16), బొబ్బిలి శ్రీకర్‌ (14), మాక్లూర్‌ మండలం డీకంపల్లికి చెందిన జీలకర్ర సురేశ్‌ (44), ఆయన కుమారుడు జీలకర్ర యోగేశ్‌ (14), గుత్పకు చెందిన దొడ్ల రాజు (24) గోదావరిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మూడు కుటుంబాలకు చెందిన మృతులంతా దగ్గరి బంధువులే.. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎస్కేప్‌ గేట్ల నుంచి స్వల్ప ఇన్‌ఫ్లో ఉండటంతో ఈ పుష్కర ఘాట్‌ వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఘాట్‌ మెట్లు దిగిన వెంటనే ఎక్కువ లోతు ఉంది. దీన్ని గమనించకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు.

ఉదయమే సందడిగా చేరుకుని..
మాక్లూర్‌ మండలం గుత్పకు చెందిన సూర నరేశ్‌ కుమారుడి కేశఖండనం కోసం కుటుంబ సభ్యులు, సమీప బంధువులంతా కలసి శుక్రవారం ఉదయం వాహనాల్లో సందడిగా గోదావరి ఒడ్డుకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గోదావరిలోకి స్నానానికి వెళ్లారు. ముందుగా సిద్ధార్థ, శ్రీకర్, రవికాంత్, యోగేశ్‌లు నదిలోకి దిగారు. స్నానం చేస్తుండగా నీటి ప్రవాహానికి తట్టుకోలేక కొట్టుకుపోసాగారు. ఇది గమనించి అక్కడే స్నానం చేస్తున్న సురేశ్, శ్రీనివాస్, రాజు వారిని కాపాడటం కోసం నీటిలోకి వెళ్లారు. రవికాంత్‌ నీట మునుగుతూ తేలడాన్ని గమనించిన స్థానికుడైన రాజు వెంటనే కాపాడి ఒడ్డుకు చేర్చాడు. కానీ మిగతా ఆరుగురు నీటిలో మునిగిపోయారు. ఈ విషయాన్ని బంధువైన మానిక్‌ భండార్‌కు చెందిన పోశెట్టి గమనించి కేకలు వేయడంతో అందరూ అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టగా గంటన్నర వ్యవధిలో ఆరుగురి మృతదేహాలు ఘాట్‌కు కొద్దిదూరంలో లభించాయి. మృతదేహాలను ఒడ్డుకు చేర్చి పోస్టుమార్టం నిమిత్తం బాల్కొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. 

కాబోయే భార్యతో వచ్చి..
ఇక మృతుల్లో ఒకరైన దొడ్ల రాజుకు వివాహం నిశ్చయమైంది. వచ్చే నెలలోనే పెళ్లి జరగాల్సి ఉంది. సూర నరేశ్‌ కుమారుడికి మేనమామ అయిన రాజు ఈ శుభకార్యానికి కాబోయే భార్యతో కలసి వచ్చాడు. కానీ మృత్యువు ఇలా కబళించుకుపోవడం ఆ కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది. గాలింపులో ముందుగా దొడ్ల రాజు మృతదేహం బయటపడగా కొనఊపిరి ఉందన్న ఆశతో 108 అంబులెన్స్‌లో నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలపడంతో కుటుంబీకులు దుఖంతో వెనుదిరిగారు. ఇటు ఘటనా స్థలాన్ని అదనపు డీసీపీ రఘువీర్, ఆర్మూర్‌ ఏసీపీ రఘు, రూరల్‌ సీఐ విజయ్‌కుమార్‌ పరిశీలించారు.

మిగతా వారిని కాపాడుదామనుకునేలోపే..: రాజు, ప్రత్యక్ష సాక్షి
‘మొదట నలుగురు స్నానానికి దిగారు.. నీటి ప్రవాహానికి నలుగురు కొట్టుకుపోతుండగా.. మిగతా ముగ్గురు వారిని కాపాడేందుకు కాస్త ముందుకెళ్లడంతో మొత్తం ఏడుగురు నీటిలో కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. అందులో ఒకరు (రవికాంత్‌) నీటిలో మునుగుతూ..పైకి తేలుతూ.. కనిపించగా.. లాక్కొచ్చి ఒడ్డుకు చేర్చాను.. మిగతా వారిని కూడా తీసుకురావాలని ప్రయత్నించగా.. అప్పటికే వాళ్లు నీటి అడుగుకు చేరిపోయారు..’అని రవికాంత్‌ ప్రాణాలను కాపాడిన రాజు చెప్పాడు.

రక్షణ చర్యలు శూన్యం..
పుష్కర్‌ఘాట్‌ వద్ద ప్రమాదాలు జరగకుండా నీటి పారుదల శాఖ రక్షణ చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారితీస్తోంది. కనీసం ప్రమాద హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. అక్కడ సంప్రదాయం ప్రకారం నదిలో తెప్పలు విడవడం కోసం అనేక మంది ఈ ఘాట్‌కు వస్తుంటారు. వర్షాకాలంలో కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నిండటంతో అప్పట్లో ఎస్కేప్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు వదిలారు. ఈ వరద తాకిడికి ఈ ఘాట్ల వద్ద మట్టి కోతకు గురైంది. దీంతో ఘాట్‌ వద్ద మోకాళ్ల మట్టుకు నీరుంటే.. ఘాట్‌కు సమీపంలోనే ఎక్కువ లోతుంది. ఈ కారణంగా ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు.

సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి
 శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రమాదవశాత్తూ జారిపడి ఆరుగురు మృతి చెందిన దుర్ఘటన పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్నానం చేసేందుకు వెళ్లి దురదృష్టవశాత్తు మృత్యువాత పడడం కలచివేసిందని శుక్రవారం ఒక ప్రకటనలో విచారం వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

మంత్రి వేముల, ఎమ్మెల్సీ కవిత విచారం..
 పుష్కర ఘాట్‌ వద్ద ఆరుగురి మరణం పట్ల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎంతో కలిచివేసిందన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరారు. సీఎం కేసీఆర్‌ గారి దృష్టికి తీసుకెళ్లి మృతుల కుటుంబాలను ఆదుకునే ప్రయత్నం చేస్తామన్నారు. ఇటు దుర్ఘటన పట్ల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వీరు ప్రాణాలు కోల్పోయారని విమర్శించారు.

మరిన్ని వార్తలు