Hyderabad Biryani Types: హైదరాబాద్‌లో 6 రకాల బిర్యానీలు.. కచ్చీ, పక్కీ బిర్యానీ అంటే తెలుసా?

7 Nov, 2021 10:54 IST|Sakshi

సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట 

నగరంలో హైదరాబాదీ బిర్యానీతోపాటు సింధీ, లక్నోవి, మొఘలాయ్, కలకత్తా, మలబార్‌ బిర్యానీలు లభ్యం 

ఎక్కడో పుట్టి..ఎక్కడో పెరిగి.. 
బిర్యానీ ఎక్కడి నుంచి వచ్చింది..అసలు ఎప్పుడు తొలిసారిగా తయారు చేశారనే దానిపై ఎన్నెన్నో వాదనలున్నాయి. పర్షియా నుంచి మొఘల్స్‌ మన దేశానికి తీసుకువచ్చారనేది ఓ వాదన. తొలిసారిగా బిర్యానీ రుచులను 16వ శతాబ్దంలో మాత్రమే చవిచూశారని..ఆ తరువాత లోకల్‌ ఫ్లేవర్స్‌ కూడా జోడించి ప్రాంతాలను బట్టి ఇప్పుడున్న బిర్యానీలు తయారు చేస్తున్నారని చెబుతున్నారు. బిర్యానీ పుట్టుక క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలోనే అలెగ్జాండర్‌ దీనిని తీసుకువచ్చాడనేది మరో ప్రచారమూ ఉంది. ఎవరి వాదనలు ఎలాగున్నా.. బిర్యానీ ఇప్పుడు స్థానికీకరించబడిందన్నది మాత్రం నిజం. హైదరాబాద్‌ దమ్‌ బిర్యానీ.. కశ్మీరీ డ్రైఫ్రూట్స్‌ బిర్యానీ, నవాబుల కిచెన్‌ల నుంచి నేరుగా వచ్చిన లక్నోవీ బిర్యానీ.. సింధీ, మొగలాయి, మలబార్‌ అన్నీ విభిన్నం.  

సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ..ఆ మాటే చాలు ఆహారాభిమానులకు నోటిలో లాలాజలం ఊరటానికి! బాస్మతి బియ్యం, మాంసం లేదంటే కూరగాయలు.. కాదంటే పన్నీర్‌...మరో వెరైటీ..ఇలా బిర్యానీ గురించి చెప్పుకుంటూ పోతే అంతే ఉండదు. నగర ఆహారంలో ఎంతగానో మమేకమై.. అంతర్జాతీయ ప్రాముఖ్యత పొందిన హైదరాబాదీ గురించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ బిర్యానీ ఇలా ఉంటే..నగరంలో మరెన్నో వెరైటీల బిర్యానీలు సైతం లభిస్తున్నాయి. అందులో కొన్ని మలబార్‌ బిర్యానీ, మొఘలాయ్, కలకత్తా, లక్కోవి, సింధీ పేరిట తయారు చేస్తున్న వెరైటీ బిర్యానీలు ఇప్పుడు నగరంలో హాట్‌ టాపిక్‌ అయ్యాయి. 

చదవండి: (నయా ట్రెండ్‌: నోరూరిస్తున్న బిర్యానీ.. తింటే వదల‘మండీ’)


నగరంలో దమ్‌ బిర్యానీ కాకుండా ఇంకెన్నో రకాల బిర్యానీలూ కూడా లభ్యమవుతున్నాయి.  
భిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయాలు, కొత్తకొత్త అభిరుచులకు తగ్గట్టుగా ప్రస్తుతం నగరంలో పలు హోటల్స్, రెస్టారెంట్స్‌ల్లో దేశ వ్యాప్తంగా లభించే వివిధ రకాల బిర్యానీలు అంటుబాటులో ఉన్నాయి.  

హైదరాబాదీ బిర్యానీ..
వరల్డ్‌ ఫేమస్‌ హైదరాబాదీ బిర్యానీ నిజాం నవాబుల కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. ఇప్పటికీ మన నగరంలో ఉంది. మన హైదరాబాదీ బిర్యానీ ప్రధానంగా రెండు రకాలలో లభ్యమవుతుంది. ఒకటి పక్కీ బిర్యానీ అయితే మరోటి కచ్చీ బిర్యానీ. పక్కీ బిర్యానీ అంటే..బాస్మతి బియ్యం వేరేగా వండటంతో పాటుగా మాంసం కూడా ప్రత్యేకంగా వండి ఆ తర్వాత రెండింటినీ లేయరింగ్‌గా చేసి వండటం. కచ్చీ బిర్యానీ అంటే మాంసం, బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు, డ్రై ఫ్రూట్స్‌..ఇలా అన్ని పదార్థాలు కలిపి, మైదాతో సీల్‌ చేసిన పాత్రలో ఉడికించి వండుతారు. నగరంలో ఎక్కువగా లభించేది ఈ బిర్యానీయే.  

మొఘలాయ్‌ బిర్యానీ 
అత్యంత రుచికరమైన బిర్యానీలలో ఇది ఒకటి. టోలిచౌకి ప్రాంతంలోని కొన్ని రెస్టారెంట్లు ఈ బిర్యానీ అందిస్తున్నాయి. మొఘల్‌ కిచెన్‌ నుంచి వచ్చిన అద్భుతమైన రుచులలో ఇది కూడా ఒకటి. పెరుగు, బాదం పేస్ట్, నెయ్యి, డ్రైఫ్రూట్స్, మాంసం లాంటి ముడి పదార్థాలతో ఇది తయారవుతుంది. మనహైదరాబాదీ బిర్యానీకి దగ్గర చుట్టం ఇది. 

ఆఫ్ఘనీ ..
ఆఫ్ఘనీ బిర్యానీ కూడా నగరంలో లభిస్తుంది. అయితే పాతబస్తీలోని మొఘల్‌పురాలో ఒకటి రెండు చోట్ల ఇది రెగ్యులర్‌గా లభిస్తుంది. ఇందులో మసాలాలు తక్కువగా వినియోగిస్తారు. డ్రైఫ్రూట్స్‌తో పాటు జైఫల్, జావాత్రి, నెయ్యి ఎక్కువగా ఉపయోగిస్తారు. 

మలబార్‌ 
కేరళలోని మలబార్‌ ప్రాంతం నుంచి వచ్చిన ఈ బిర్యానీ సైతం దమ్‌ శైలిలోనే వండుతారు. స్వీట్‌ అండ్‌స్పైసీ బిర్యానీ ఇది. దీనిలోనూ పలు రకాలున్నాయి. అంటే ప్రాంతాన్ని బట్టిఫ్లేవర్‌లు కూడా మారుతుంటాయి. ఈ బిర్యానీ పంజాగుట్ట ప్రాంతంలోని పలు రెస్టారెంట్లలో ప్రత్యేకంగా అందిస్తున్నారు.

సింధీ
గుజరాతీలకు ప్రీతిపాత్రమైన బిర్యానీ ఇది. సింధ్‌ ప్రాంతపు రుచులను ఇది చవిచూపిస్తుంది. దీనిలో పచ్చిమిర్చి, రోస్టెడ్‌స్పైస్, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, డ్రైఫ్రూట్స్, పులిసిన పెరుగు వంటివి విరివిగా వాడతారు. సికింద్రాబాద్‌లోని ఎంజీ రోడ్డులోని సింధీ రెస్టారెంట్‌లో లభిస్తుంది. 

లక్నోవీ 
మన హైదరాబాద్‌ బిర్యానీకి దగ్గర చుట్టం ఈ లక్నోవీ బిర్యానీ. ఇది కూడా నిజామ్‌ల (అవధ్‌ ప్రాంతీయులు) కిచెన్‌లో రూపుదిద్దుకున్నదనే నమ్మకం. కాకపోతే మన హైదరాబాద్‌ బిర్యానీ అంత స్పైసీగా మాత్రం ఇది ఉండదు. దమ్‌పుక్త్‌ శైలిలో ఇది రూపుదిద్దుకుంటుంది. మీరాలంమండిలోని హోటల్స్‌లో ఈ బిర్యానీని ఆఫర్‌ చేస్తున్నారు. 

కలకత్తా బిర్యానీ.. 
ఈ లక్నోవీ బిర్యానీకి సబ్‌వేరియంట్‌ కలకత్తా బిర్యానీ. అదెలా అంటే, బ్రిటీషర్లను కలుసుకోవడానికి కలకత్తా వెళ్లిన అవధ్‌ నవాబు వాజీద్‌ అలీ షా ఫుడ్‌ పరంగా అమిత జాగ్రత్తలు తీసుకునేవాడు. ఎక్కడకు వెళ్లినా తన వంట వారిని వెంటపెట్టుకుని వెళ్లే అతను కలకత్తాకు కూడా అలాగే వెళ్లారట. అక్కడ చేసిన ప్రయోగాలకు ప్రతిరూపం కలకత్తా బిర్యానీ అన్నది ఓ వాదన. అయితే బెంగాలీల ఇతర వంటకాల్లాగానే కాస్త తియ్యదనం ఈ బిర్యానీలో ఉంటుంది. ఎల్లో రైస్, యోగర్ట్‌ బేస్డ్‌మీట్, బాయిల్డ్‌ఎగ్, బంగాళా దుంపలతో ఈ బిర్యానీ రూపుదిద్దుకుంటుంది. బెంగాలీ స్నేహితుల ఇళ్లలో మాత్రమే కాదు.. నగరంలో కొన్ని రెస్టారెంట్లలో జరిగే ఫుడ్‌ఫెస్టివల్స్‌ సమయంలో ఈ రుచులను ఆస్వాదించొచ్చు. ప్రత్యేంగా పాతబస్తీలోని ఘాన్సీబజార్‌లోని పలు బెంగాలీ హోటల్స్‌ అందుబాటులో ఉంది.  

మరిన్ని వార్తలు