అశ్విత్‌కు తగిన సాయం చేయండి

28 Aug, 2021 04:02 IST|Sakshi
రెయిన్‌బో ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుడు 

తన కార్యాలయ సిబ్బందికి మంత్రి కేటీఆర్‌ ఆదేశం 

‘సాక్షి’ కథనానికి స్పందించిన మంత్రి  

రూ.1.85 లక్షల విరాళాలిచ్చిన దాతలు

ఇల్లందకుంట (హుజూరాబాద్‌): జన్యుపరమైన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడు ఆకుల అశ్విత్‌ ఆరోగ్య పరిస్థితిపై రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఆరాతీశారు. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్‌కు చెందిన అశ్విత్‌ మృత్యువుతో పోరాడుతున్న విషయంపై ‘అప్పుడు అన్న.. ఇప్పుడు తండ్రిని కోల్పోయి’శీర్షికతో ఈ నెల 25న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్‌ బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు.

బాలుడి చికిత్సకు తగిన సాయం చేయాలని తన కార్యాలయ సిబ్బందికి సూచించారు. దీంతో పూర్తి వివరాలు తెలుసునేందుకు హైదరాబాద్‌ నుంచి మంత్రి సిబ్బంది అశ్విత్‌ కుటుంబ సభ్యులకు శుక్రవారం ఫోన్‌ చేశారు. కాగా, ‘సాక్షి’ కథనాన్ని కొందరు ట్విట్టర్, ఫేస్‌బుక్, వాట్సాప్‌ గ్రూపుల్లో పోస్టు చేయడంతో సాయం చేసేందుకు పలువురు దాతలు ముందుకొస్తున్నారు. రెండ్రోజుల్లో రూ.1.85 లక్షలు విరాళంగా వచ్చాయి. అశ్విత్‌ పరిస్థితిని తెలుసుకున్న హైదరాబాద్‌ రెయిన్‌బో ఆస్పత్రి వైద్యులు బాలుడి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశారు. అశ్విత్‌ను తమ ఆస్పత్రికి తీసుకురావాలని సూచించారు. శుక్రవారం బాలుడిని అక్కడికి తీసుకెళ్లడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. 

మరిన్ని వార్తలు