70 ఏళ్లు.. 9 కి.మీటర్లు.. 83 నిమిషాలు

14 Nov, 2022 02:51 IST|Sakshi
వరల్డ్‌ రికార్డ్స్‌తో డాక్టర్‌ ఎద్దుల కృష్ణారెడ్డి, జీవీఆర్‌ కరాటే అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ జీఎస్‌ గోపాల్‌రెడ్డి తదితరులు 

వేగవంతమైన నడకతో నగరానికి చెందిన డాక్టర్‌ కృష్ణారెడ్డి ప్రపంచ రికార్డు

కాచిగూడ (హైదరాబాద్‌): కాచిగూడలోని జీవీఆర్‌ కరాటే అకాడమీ డైరెక్టర్‌ డాక్టర్‌ జి.ఎస్‌.గోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్‌ ఎద్దుల కృష్ణారెడ్డి (70) 9 కిలోమీటర్లను 83 నిమిషాల్లో నడిచి వరల్డ్‌ రికార్డును సాధించారు. ఇప్పటికే గతంలో రెండు వరల్డ్‌ రికార్డ్స్‌ను డాక్టర్‌ కృష్ణారెడ్డి తన ఖాతాలో వేసుకున్నారు. సైదాబాద్‌లోని వివేక్‌ ఆస్పత్రి వద్ద డాక్టర్‌ కృష్ణారెడ్డి ప్రారంభించిన నడకను జైళ్ళ శిక్షణ కళాశాల (చంచల్‌గూడ) ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌రెడ్డి, జైలర్‌ రత్నంలు ప్రారంభించారు.

ట్యాంక్‌బండ్‌లోని వివేకానంద విగ్రహం వరకు 9 కిలోమీటర్ల దూరాన్ని 83 నిమిషాల్లో నడిచి ఆయన ఈ రికార్డును నెలకొల్పారు. కృష్ణారెడ్డి చేసిన ఈవెంట్‌ను గుర్తించి (9 వరల్డ్‌ రికార్డ్‌ సంస్థలు) వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, జీనియస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ట్రెజర్‌ వరల్డ్‌ రికార్డ్స్, గ్రాండ్‌ వరల్డ్‌ రికార్డ్స్, స్టేట్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్, ఫోకస్‌ వరల్డ్‌ రికార్డ్స్, గ్లోరీ వరల్డ్‌ రికార్డ్స్, కోహినూర్‌ వరల్డ్‌ రికార్డ్స్, విశ్వం వరల్డ్‌ రికార్డ్స్‌ సంస్థలు రికార్డ్‌ను నమోదు చేశాయి.

ఈ సందర్భంగా జీవీఆర్‌ కరాటే అకాడమీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయా సంస్థల ప్రతినిధుల సమక్షంలో రికార్డును కృష్ణారెడ్డికి అందజేశారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ...ఈ రికార్డ్‌ను సీనియర్‌ సిటిజన్స్‌కు అంకితం ఇస్తున్నట్లు తెలి­పారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి, వ్యాయా­మం చేయాలని సూచించారు. కార్యక్రమంలో జీవీఆర్‌ కరాటే అకాడమి కరాటే బ్లాక్‌బెల్ట్‌ ప్రతినిధులు కరీం, సుభాష్, సర్వర్, అమృత తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు