ఏడుపదుల వయసులోనూ..

21 Jan, 2021 09:15 IST|Sakshi

ఒకప్పుడు చిన్న మ్యాటర్‌ రాయాలన్నా టైప్‌ సెంటర్ల వద్దకు క్యూ కట్టాల్సి వచ్చేది.. కొన్ని ఉద్యోగాలకు టైపు రైటింగ్‌ తప్పనిసరి. టైప్‌ రైటింగ్‌ నేర్చుకునేందుకు సెంటర్ల వద్ద టైమ్‌ ఫిక్స్‌ చేసుకొని బ్యాచ్‌లు ఏర్పాటు చేసుకునేవారు. మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏ కాలనీలో చూసినా ఆన్‌లైన్, మీసేవ, నెట్‌ సెంటర్లే కనిపిస్తున్నాయి. ఏ సేవలైనా కంప్యూటర్‌ కావాల్సిందే.. దాదాపు టైప్‌ ఇనిస్టిట్యూట్స్‌ మూతపడ్డాయి. కానీ 70 సంవత్సరాల వయసులోనూ ఓ వ్యక్తి టైప్‌ ఇనిస్టిట్యూట్‌ నడిపిస్తూ.. నామమాత్రపు ఫీజు తీసుకొని ఎంతో మంది విద్యార్థులకు టైపింగ్‌లో శిక్షణ ఇస్తున్నాడు.                          

సూరారం గ్రామానికి చెందిన సామల యాదగిరి సూపరింటెండెంట్‌గా రిటైరయ్యారు. బోయిన్‌పల్లిలోని జెడ్పీహెచ్‌ఎస్‌ స్కూల్లో చదివిన ఆయన డిగ్రీ పూర్తి చేసి ఐడీపీఎల్‌లో పనిచేస్తూ, మరోపక్క అమీర్‌పేట్‌లో టైపు నేర్చుకొని లోయర్, హైయర్‌లో ఉత్తీర్ణత సాధించాడు. 1969లో పరిశ్రమల శాఖలో టైపిస్ట్‌గా చేరి నెలకు రూ.130 జీతం తీసుకున్నాడు. 1979లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందాడు. పనిలో మరింత చురుగ్గా వ్యవహరించడంతో 1996లో ఆఫీస్‌ సూపరింటెండెంట్‌గా ప్రమోషన్‌ పొంది మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. 2004లో పదవి విరమణ అనంతరం సూరారంలో కుత్బుల్లాపూర్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వద్ద శ్రీచక్ర టైపు ఇనిస్టిట్యూట్‌ను స్థాపించి నామమాత్రపు ఫీజు తీసుకుని యువతకు శిక్షణ ఇస్తున్నారు. ఏడు పదుల వయసులో కూడా నిముషానికి 45 పదాలు టైప్‌ చేస్తూ తనకుతానే సాటి అనిపించుకున్నాడు. శిక్షణ కోసం పేద, మధ్యతరగతి విద్యార్థులు ఎక్కువగా వస్తున్నారు. ఫీజు గురించి వారిపై ఎప్పుడూ ఒత్తిడి పెంచకుండా వారికి టైప్‌ రైటింగ్‌లో తర్ఫీదునిస్తున్నాడు.

టైప్‌ మిషన్‌ మరిచిపోయారు 
నేటి యువత కంప్యూటర్‌ వాడుతున్నారు. కొంతమంది టైప్‌ చేసేందుకు బద్దకిస్తూ ఫోన్‌లో వాయిస్‌ టైపింగ్‌ చేస్తున్నారు. చాలామంది టైప్‌ మిషన్‌ అనేది ఉందనే విషయాన్ని మరిచిపోయారు. టైప్‌ రైటింగ్‌ నేర్చుకుంటేనే కంప్యూటర్‌పై రాణించగలుగుతారు. ప్రభుత్వం టైప్‌ మిషన్‌ నేర్చుకోవాలనే రూల్‌ పెడితే నేటి యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. 
– సామల యాదగిరి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు