ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరో 123 ఔషధాలు 

8 Jul, 2022 01:02 IST|Sakshi

మరిన్ని మందులుఫ్రీ

విటమిన్‌ కాంబినేషన్ల నుంచి యాంటీ బయాటిక్స్‌ దాకా..

వివిధ వ్యాధులకు వాడే ప్రత్యేక ఔషధాలూ అందుబాటులోకి..

మొత్తంగా 720 నుంచి 843కి పెరిగిన ఉచిత మందుల సంఖ్య

ప్రతి ఆస్పత్రిలో 3 నెలలకు సరిపడా అత్యవసర మందుల స్టాక్‌

సాధారణ మందులు కూడా తగిన స్థాయిలో నిల్వ ఉండేలా చర్యలు

ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు బయట ప్రైవేటుగా మందులు కొనాల్సిన అవసరం రాకుండా.. అవసరమైన ఔషధాలన్నింటినీ అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అత్యవసర, సాధారణ మందుల సంఖ్యను పెంచాలని.. కొత్తగా 123 రకాల మందులను అందుబాటులోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 720 రకాల మందులను ఫ్రీగా ఇస్తుండగా.. ఈ జాబితాను 843కు పెంచింది. ఇందులో అత్యవసర మందుల జాబితా (ఈఎంఎల్‌)లో 311, ఇతర సాధారణ (అడిషనల్‌) మందుల జాబితా (ఏఎఎల్‌)లో 532 మందులు ఉన్నాయి. 

తమిళనాడులో పరిశీలన జరిపి..
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని పటిష్టం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌.. మందుల జాబితాను సంస్కరించాలని వైద్యారోగ్య శాఖను ఆదేశించారు. దీనితో ప్రస్తుత అవసరాలు, భవిష్యత్‌ పరిస్థితులకు అనుగుణంగా సమగ్ర జాబితా రూపొందించడంపై వైద్యారోగ్య శాఖ కసరత్తు చేసింది. ఇందులో భాగంగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ బృందం తమిళనాడుకు వెళ్లి అక్కడి విధానంపై అధ్యయనం చేసింది. ఏఎంఎల్, ఈఎంఎల్‌ జాబితాలో ఎన్ని రకాల మందులున్నాయి, ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ఎలా ఉంది వంటి అంశాలను పరిశీలించింది. పూర్తి వివరాలతో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించింది. ఆ నివేదిక స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ.. మందుల తుది జాబితాను రూపొందించింది. మొత్తం మందులను 30 కేటగిరీలుగా విభజించి, ఒక్కో కేటగిరీలో మందుల ఎంపిక కోసం ఆయా విభాగాల్లోని ఇద్దరు వైద్య నిపుణులను నియమించింది. తుది జాబితాను సిద్ధం చేసింది.

ప్రొక్యూర్‌మెంట్‌ విధానంలో మార్పులు
ఇప్పటివరకు అత్యవసర జాబితాలోని మందులు కావాలంటే ఇండెంట్‌ పెట్టాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడీ విధానాన్ని మార్చేశారు. అత్యవసర జాబితాలోని 311 మందులను ఇక మీద వినియోగం ఆధారంగా సేకరించనున్నారు. ప్రతి ఆస్పత్రి కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందుల బఫర్‌ స్టాక్‌ సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సాధారణ జాబితాలోని 532 మందుల్లో 313 మందులను కేంద్రీకృత సేకరణ కింద టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సేకరిస్తుంది. దీనికోసం ఆయా విభాగాల హెచ్‌వోడీలు, సూపరింటెండెంట్లు ముందుగానే ఇండెంట్‌ పెడుతుంటారు. మరో 219 రకాల మందులను డీ సెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కింద ఆస్పత్రులు నేరుగా సేకరించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. మొత్తం 843 రకాల మందుల్లో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా 624 రకాలను సేకరిస్తారు.

అవసరమైన మందులన్నీ అందుబాటులో..
చికిత్సలో భాగంగా అవసరమయ్యే ప్రతీ ఔషధాన్ని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచి.. రోగులకు పూర్తి ఉచితంగా అందించేందుకు సర్కారు కృషి చేస్తోంది. టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ద్వారా పెద్ద మొత్తంలో మందుల సేకరణ చేస్తూనే.. వికేంద్రీకృత విధానంలో భాగంగా అవసరమైన, అరుదైన మందులను ఆస్పత్రులు తక్షణమే కొనుగోలు చేసి రోగులకు ఇచ్చే ఏర్పాటు చేసింది. దీంతో పేద ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ఉంటుందని అధికారులు చెప్తున్నారు. కొత్త విధానాన్ని వెంటనే అమలు చేసేందుకు వైద్యారోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో జీవో విడుదల చేయనున్నట్టు సమాచారం.

బయట మందులు కొనే అవసరం రాకుండా..
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు అవసరమైన మందులను బయట ప్రైవేటుగా కొనే అవసరం లేకుండా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని.. అందులో భాగంగానే మందుల సంఖ్యను పెంచుతోందని అధికారులు చెప్తున్నారు. కొత్తగా పెంచిన మందుల్లో యాంటీ బయాటిక్స్, శరీరానికి అవసరమయ్యే విటమిన్లు, ఖనిజ లవణాలు, వివిధ రోగాల చికిత్సలో ప్రత్యేకంగా అవసరమయ్యే మందులు, చిన్న పిల్లలకు ఇచ్చే సిరప్‌లు ఉన్నట్టు సమాచారం. బీ1, బీ2, బీ 6, బీ12, కె, ఈ, డీ, సీ విటమిన్లు, ఐరన్‌ మాత్రలు, వివిధ విటమిన్ల కాంబినేషన్‌ మాత్రలు, క్లాక్సాసిల్లిన్, సిప్రొఫ్లాక్సిన్, క్లావులనేట్, సెపోడాక్సిన్, ఓ ఫ్లాక్సాసిల్లిన్‌ వంటి యాంటీ బయాటిక్స్, ఇతర మందులు ఉన్నట్టు తెలిసింది. వీటిని వివిధ మోతాదులలో అందుబాటులో ఉంచనున్నారు. అధికారికంగా జీవో విడుదలైన తర్వాత ఏయే రకాల మందులు, ఏయే మోతాదులలో సిద్ధంగా ఉంచుతారన్న పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. 

>
మరిన్ని వార్తలు