ఏం యూత్‌రా బాబూ! కడుపుల చల్ల కదలకపాయే.. గిట్లయితే కష్టమే? పరిస్థితి ఇలాగే కొనసాగితే..

8 Feb, 2023 18:46 IST|Sakshi

ఇండియాలో 11–17 ఏళ్లలో 74% మందికి శారీరక శ్రమ లేదు 

దీనిపై పర్యవేక్షణ కరువు... ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడి 

బద్దకం, సమయాభావంతో బలిపీఠంపైకి యువతరం 

యువజనం కంటే 70 ఏళ్లకి పైబడిన వృద్ధులే పక్కాగా వ్యాయామాలు చేస్తున్నారట 

నలుగురిలో ముగ్గురు యువకులు వ్యాయామానికి దూరం 

వ్యాయామం లేకుంటే షుగర్, బీపీ, ఏడు రకాల క్యాన్సర్లు ఆయా జబ్బులకు ఏడాదికి రూ. 25,760 కోట్ల ఖర్చు  

పిల్లలకు రోజుకు గంట వ్యాయామం తప్పనిసరని సూచన 

దేశంలో నేటికీ వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం లేదు

సాక్షి, హైదరాబాద్‌: 2022 లెక్కల ప్రకారం భారతదేశ జనాభా 141.7 కోట్లు. అందులో 20 ఏళ్ల కంటే తక్కువ వయస్సుగలవారు 34 శాతం మంది ఉన్నారు. ఆ వయస్సుగల పిల్లలు, టీనేజర్లు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 11–17 ఏళ్ల మధ్య వయస్సుగల వారిలో 74 శాతం మంది శారీరక శ్రమ చేయడం లేదని తేల్చిచెప్పింది.

ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. 11–17 ఏళ్ల మధ్య వయస్సువారు రోజుకు కనీసం 60 నిముషాలు కఠిన లేదా మధ్యస్థ వ్యాయామం చేయాలని సూచించింది. ఇక 18 ఏళ్ల పైబడినవారిలో పురుషుల్లో 25 శాతం, మహిళల్లో 40 శాతం శారీరక శ్రమ చేయడంలేదు. అంటే సరాసరి 32.5 శాతం అన్నమాట.

వీళ్లు వారానికి 150 నిమిషాలు మధ్యస్థాయి వ్యాయామం లేదా 75 నిమిషాలు కఠిన వ్యాయామం చేయాలి. 70 ఏళ్లు పైబడినవారిలో పురుషులు 38 శాతం, మహిళలు 50 శాతం మంది శారీరక శ్రమ చేయడంలేదు. విచిత్రమేంటంటే... 11–17 ఏళ్ల వయస్సువారికంటే 70 ఏళ్లు పైబడిన వృద్ధులే నిర్ణీతంగా ఎక్కువగా వ్యాయామం చేస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

దీర్ఘకాలిక జబ్బులు... ఏడాదికి రూ. 25,760 కోట్ల ఖర్చు  
శారీరక శ్రమ చేయకపోవడం వల్ల దేశంలో దీర్ఘకాలిక జబ్బులు, మానసిక జబ్బులు పెరుగుతున్నాయి. ప్రధానంగా గుండెపోటు, పక్షవాతం, షుగర్, బీపీ, ఏడు రకాల క్యాన్సర్లు.. రొమ్ము, పెద్ద పేగు, గర్భసంచి, గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్‌ క్యాన్సర్‌ వస్తాయి. అలాగే మతిమరుపు, కుంగుబాటు జబ్బులు వస్తాయని స్పష్టం చేసింది.

దేశంలో జరిగే మరణాల్లో 66 శాతం దీర్ఘకాలిక జబ్బులే కారణమని పేర్కొంది. అందులో 25 శాతం గుండె, 10 శాతం క్యాన్సర్, 15 శాతం ఊపిరితిత్తులు, డయాబెటీస్‌ వల్ల 4 శాతం, ఇతరత్రా దీర్ఘకాలిక జబ్బులతో 11 శాతం మరణాలు సంభవిస్తున్నాయని పేర్కొంది. శారీరక శ్రమ చేయకపోవడం వచ్చే ఈ జబ్బులను నయం చేసేందుకు ఏడాదికి ప్రజలు రూ. 25,760 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే పదేళ్లలో వీటివల్ల ప్రజలపై పడే ప్రత్యక్ష భారం రూ. 2.83 లక్షల కోట్లు ఉంటుందని హెచ్చరించింది.  

వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానమేదీ?  
దేశంలో పిల్లలు కేవలం చదువులకే అతుక్కుపోతున్నారు. స్కూలు, కాలేజీల సమయంలో కనీసం 4 అడుగులు వేసే పరిస్థితి కూడా లేదు. స్పోర్ట్స్‌ వ్యవస్థ కుంటుపడింది. పాఠశాలల్లో నాణ్యమైన శారీరక శ్రమ చేయించే వ్యవస్థ లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అసలు జాతీయస్థాయిలో చిన్న పిల్లల్లో శారీరక శ్రమను పర్యవేక్షించే వ్యవస్థ లేదని ఎత్తిచూపింది. వాకింగ్, సైక్లింగ్‌పై జాతీయ విధానం లేదని తెలిపింది.

శారీరక శ్రమను బహిరంగ ప్రదేశాల్లో చేసేలా ప్రోత్సహించాలని, వాకింగ్, సైక్లింగ్‌ను ప్రోత్సహించాలని పేర్కొంది. పనిచేసే చోట కూడా శారీరక శ్రమను ప్రోత్సహించాలని ఇండియాకు సిఫార్సు చేసింది. రోజుకు 10–12 గంటలు స్థిరంగా కూర్చునే వారిలో ముందస్తు మరణాలు సంభవించే అవకాశం మిగతావారి కంటే 1.5 రెట్లు ఎక్కువ. శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారిలో కిడ్నీ సమస్యలు, కడుపులో మంట, కేన్సర్‌ వంటివి 10 నుంచి 20 శాతం వరకు తగ్గుతాయి. అధిక బరువు సమస్య తలెత్తదు. షుగర్‌ వ్యాధిగ్రస్తులకు గుండెజబ్బు మరణాలు 40 శాతం తగ్గుతాయి. 

శారీరక శ్రమను ప్రోత్సహించాలి 
డబ్ల్యూహెచ్‌వో నివేదికలో­ని అంశాలు ఆలోచించదగినవి.. శారీరక శ్రమ చేసేందుకు పిల్లలను, పెద్దలను ప్రోత్సహించాలి. తద్వారా వారిలో గుండె, ఊపిరితిత్తుల సామ­ర్థ్యం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. మానసిక ఉల్లాసం లభిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధు­లు దరిచేరవు. 
–డాక్టర్‌ హరిత, వైద్యురాలు, నిజామాబాద్‌    

మరిన్ని వార్తలు