రాష్ట్రాభివృద్ధిని చూసి వరుణదేవుడు కరుణిస్తున్నాడు

15 Aug, 2020 11:08 IST|Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. శనివారం రోజున కలెక్టరేట్‌ కార్యాలయంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జెండా పండుగను సంతోషంగా దేశవ్యాప్తంగా చేసుకుంటారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ సంక్షేమం, అభివృద్ధి దిశగా వెళ్తోంది. గత పాలకులు తెలంగాణ అభివృద్ధి నిర్లక్ష్యం చేసాయి. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది.. వారి ఆశయాలను సాధిస్తాం. దేశంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర అభివృద్ధిని చూసి వరుణదేవుడు కూడా కరుణిస్తున్నాడు. తెలంగాణలో కుల వృత్తులు అభివృద్ధి చెడుతున్నాయంటే సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ('చేతకాని దద్దమ్మలు కుట్రలు పన్నుతున్నారు')

ఒకప్పుడు మెదక్ జిల్లా విద్యారంగంలో వెనుకబడింది. ప్రస్తుతం 33 శాతం పెరిగింది. పేద విద్యార్ధులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలని మధ్యాహ్న భోజన పథకం అమలు చేశాం. నియంత్రణ సాగు ద్వారా రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. రైతులకు పెట్టుబడి ఇవ్వాలనే గొప్ప సంకల్పం గల నాయకుడు కేసీఆర్. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటి ఇంటికీ తాగునీరు అందిస్తున్నాం. గర్భిణీలకు కేసీఆర్ కిట్ అందిస్తున్నాము. షాదీముబారక్, కళ్యాణ లక్ష్మీ పథకం ద్వారా పేద ఆడపిల్లలను తెలంగాణ సర్కార్‌ ఆదుకుంటోంది. కరోనాను అదుపు చేయడంలో తెలంగాణ సర్కారు అన్ని రకాల చర్యలు చేపడుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం తెలంగాణ సర్కార్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతోంది. గతంలో వర్షాలు లేక, గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్యలు చేసున్న పరిస్థితి ఉండేది. కాగా.. ప్రస్తుతం లేదు ఆ పరిస్థితి లేదు అని మంత్రి తలసాని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు