గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌కు 75% హాజరు 

17 Oct, 2022 01:46 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 503 గ్రూప్‌–1 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ఆదివారం నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షకు 75 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్షా కేంద్రాల్లో ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్ష జరిగింది. మొత్తం 3,80,081 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా వారిలో 2,86,051 మంది హాజరైనట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.

పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి బయోమెట్రిక్‌ పద్ధతిలో హాజరును స్వీకరించినట్లు తెలిపింది. స్వరాష్ట్రంలో తొలిసారి జరుగుతున్న పరీక్ష కావడంతో ఎక్కడా అవకతవకలకు అవకాశం లేకుండా టీఎస్‌పీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో అనుసంధానించింది. ప్రతి జిల్లాకు ఒక కోఆర్డినేటర్‌తోపాటు సిట్టింగ్‌ స్క్వాడ్‌లు, 61 మంది లైజనింగ్‌ అధికారులు, జిల్లా అధికారుల ద్వారా పరీక్ష నిర్వహించింది. 

8 పని దినాల్లో ఓఎంఆర్‌ షీట్ల స్కానింగ్‌... 
అభ్యర్థుల ఓఎంఆర్‌ జవాబుపత్రాలను స్కానింగ్‌ చేసి వెబ్‌సైట్‌లో అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఇందుకు 8 పనిదినాలు పడుతుందని భావిస్తోంది. ఓఎంఆర్‌ షీట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాకే ప్రాథమిక ‘కీ’ని విడుదల చేయనుంది. ప్రిలిమినరీ పరీక్షను ప్రశాంతంగా నిర్వహించినందుకు టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డి  కలెక్టర్లు, అధికారులను అభినందించారు. 

అభ్యర్థిని సకాలంలో పరీక్షా కేంద్రానికి చేర్చిన పోలీసులు 
మెదక్‌ జోన్‌: మెదక్‌ జిల్లా కేంద్రంలోని గీతా జూనియర్‌ కాలేజీలో కిషన్‌ అనే అభ్యర్థి పరీక్ష రాయాల్సి ఉండగా అతను పొరపాటున అక్కడికి 2 కి.మీ. దూరంలోని సాధన జూనియర్‌ కళాశాలకు వచ్చాడు. అప్పటికే సమయం ఉదయం 10:13 గంటలు కావడం.. అభ్యర్థులను 10:15 గంటల తర్వాత పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించే అవకాశం లేకపోవడంతో ఆ యువకుడు ఆందోళన చెందుతూ కనిపించాడు. దీంతో అక్కడే ఉన్న డీఎస్పీ సైదులు, సీఐ మధు తమ ఎస్కార్ట్‌ వాహనంలో కిషన్‌ను సకాలంలో గీతా కాలేజీకి పంపారు. ఎస్కార్ట్‌ వాహన డ్రైవర్‌ సైరన్‌ మోగిస్తూ 2 కి.మీ. దూరంలోని గీత కాలేజీకి ఒకటిన్నర నిమిషంలోనే తీసుకెళ్లాడు. 

గ్రూప్‌–1 పరీక్ష రాసిన ఖైదీ 
ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న జాదవ్‌ రమేశ్‌ అనే యువకుడు నిర్మల్‌ జిల్లా కోర్టు అనుమతితో ఆదివారం గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ రాశాడు. ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడంటూ నిర్మల్‌ జిల్లా కేంద్రంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న కేసులో అరెస్టయిన రమేశ్‌ 45 రోజులుగా జిల్లా జైలులో ఖైదీగా ఉన్నాడు. 


ఆదిలాబాద్‌లో.. పరీక్ష రాసి బయటకు వస్తున్న ఖైదీ జాదవ్‌ రమేశ్‌తో పోలీసులు 

చిన్నారికి ఏసీపీ లాలింపు.. 
ఖిలా వరంగల్‌: వరంగల్‌ ఫోర్ట్‌ రోడ్‌లోని ఏఎస్‌ఎం మహిళా డిగ్రీ కళాశాల కేంద్రానికి 2 నెలల పసిబిడ్డతో వచ్చి ఓ తల్లి పరీక్ష రాస్తుండగా ఆ చిన్నారి ఒక్కసారిగా ఏడుపు మొదలుపెట్టింది. అప్పుడే పరీక్ష కేంద్రాన్ని సందర్శించేందుకు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్‌ ముస్క శ్రీనివాస్‌తో కలసి వచ్చిన వరంగల్‌ ఏసీపీ కలకోట్ల గిరికుమార్‌ ఆ చిన్నారిని ఎత్తుకొని∙కాసేపు లాలించారు. ప్రశాంతంగా పరీక్ష రాయాలని... బిడ్డను క్షేమంగా చూసుకుంటామని పాప తల్లికి చెప్పారు. అక్కడే ఉన్న ఏఎస్సై స్వరూపరాణికి బిడ్డను అప్పగించారు. 


వరంగల్‌లో.. చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్న ఏసీపీ గిరికుమార్‌   

ఆభరణాలు తొలగిస్తేనే ప్రవేశం..
అభ్యర్థులు ఆభరణాలు ధరించి రాకూడదని టీఎస్‌పీఎస్సీ నిబంధన విధించినా కొన్నిచోట్ల మహిళలు గాజులు, కమ్మలు, చైన్లు, కాళ్ల పట్టీలతో కేంద్రాలకు చేరుకున్నారు. ఇందుకు ఎగ్జామ్‌ సెంటర్ల నిర్వాహకులు అభ్యంతరం తెలపడంతో వారు ఆభరణాలను తొలగించడం కనిపించింది. కాగా, మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని గాదె రుక్మారెడ్డి పరీక్ష కేంద్రంలో ఒంటి గంటకు ముగించాల్సిన పరీక్షకు.. పది నిమిషాలు ఆలస్యంగా పేపర్లు తీసుకున్నారని కొందరు అభ్యర్థులు ఆరోపించారు.  

మరిన్ని వార్తలు