75 వేలు దాటాయి

8 Aug, 2020 05:26 IST|Sakshi

ఒక్కరోజే 23,495 పరీక్షలు... భారీగా 2,207 కేసులు

తాజాగా 12 మంది మృతి.. మొత్తం మరణాలు 601

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కరోనా వైరస్‌ వీరవిహారం చేస్తూనే ఉంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కరోనా కేసులు 75 వేల మార్కును దాటడం ఆందోళన కలిగిస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో ఇప్పటివరకు 5,66,984 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా, ఏకంగా 75,257 కేసులు నమోదయ్యాయి. అలాగే మొత్తం మరణాల సంఖ్య 601కి చేరుకుంది. ఇక ఒకేరోజు నిర్ధారణ పరీక్షలు, పాజిటివ్‌ కేసుల సంఖ్య అత్యధికంగా నమోదయ్యాయి. ఇప్పటివరకు ఎన్నడూ చేయని విధంగా గురువారం ఒక్కరోజే 23,495 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అత్యధికంగా 2,207 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆ బులెటిన్‌లో వివరించారు.

తాజాగా 12 మంది మృతి చెందారు. ప్రస్తుతం 21,417 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో 14,837 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తాజాగా 1,136 మంది బాధితులు డిశ్చార్జి కాగా, మొత్తంగా ఇప్పటివరకు 53,239 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 70.7 శాతంగా ఉందని, ఇది దేశ సగటు (67.62 శాతం) కంటే ఎక్కువ అని ఆయన వివరించారు. కాగా గురువారం జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా 532 కేసులు నమోదయ్యాయి. అలాగే రంగారెడ్డిలో 196, వరంగల్‌ అర్బన్‌ 142, మేడ్చల్‌ 136, భద్రాద్రి కొత్తగూడెం 82, జనగాం 60, గద్వాల్‌ 87, కామారెడ్డి 96, కరీంనగర్‌ 93, ఖమ్మం 85, నిజామాబాద్‌ 89, పెద్దపల్లి జిల్లాలో 71 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు