79 శాతం ద్విచక్రవాహనదారులు, పాదచారులే..

5 Oct, 2020 03:35 IST|Sakshi

రోడ్డు ప్రమాదాల్లో చితుకుతున్న పేదల బతుకులు 

కార్లు, భారీ వాహన ప్రమాదాల్లో మరణాలు తక్కువే 

తాజా సర్వేలో వెలుగులోకి పలు కీలక అంశాలు

సాక్షి, హైదరాబాద్‌: రోడ్డు ప్రమాదాల్లో పేదల బతుకులు చితికిపోతున్నాయి. దేశవ్యాప్తంగా చోటుచేసుకున్న ఈ ప్రమాదాల్లో ఎక్కువగా పేదలే వీటి బారిన పడి మృత్యువాత పడుతున్నారు. ఇలా మరణిస్తున్న వారిలో తగిన జీవనభృతి, ఉపాధి ఆదాయం వంటివి లేనివారే అధికంగా ఉంటున్నారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో  ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కలిపి 79 శాతం మంది ఉంటున్నారని ఇటీవల జరిపిన విస్తృత పరిశీలనల్లో వెల్లడైంది.  

వివిధ అంశాలపై సర్వే డేటా క్రోడీకరణ
దేశవ్యాప్తంగా 20 నగరాల్లోని 54 ఆసుపత్రుల్లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసులు, ఈ ప్రమాదాల్లో మరణించిన వారి స్థితిగతులు, ఇతర అంశాలపై సేకరించిన సమాచారంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీఆర్‌ఐపీపీ ఐఐటీ (ఢిల్లీ) ఆధ్వర్యంలోని బృందంతో పాటు, డీఐఎంటీఎస్‌ వేర్వేరు రూపాల్లో పోలీస్‌స్టేషన్ల నుంచి ఎఫ్‌ఐఆర్‌లు, ఇతరత్రా సేకరించిన సమాచారాన్ని ఒకచోట చేర్చి రోడ్డు ప్రమాదాల కారణంగా ఆర్థికంగా, సామాజికంగా పడే భారం, ప్రభావాన్ని పరిశీలించారు. వివిధ అంశాలకు సంబంధించి సేకరించిన సమాచారం, డేటాను క్రోడీకరించి రోడ్డు ప్రమాదాల వల్ల సామాజిక–ఆర్థిక పరంగా పడే భారం, ఖర్చులపై కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రిత్వశాఖకు నివేదికను అందజేసినట్టు సమాచారం. అయితే ఈ నివేదికను ఇంకా కేంద్రం బహిర్గతపరచలేదు. 

ఎఫ్‌ఐఆర్‌ల విశ్లేషణ
పోలీస్‌స్టేషన్ల నుంచి సేకరించిన ఎఫ్‌ఐఆర్‌లను విశ్లేషించినపుడు దాదాపు 79 శాతం రోడ్డు ప్రమాద మృతులు ద్విచక్ర వాహనదారులు (40 శాతం), పాదచారులు (39 శాతం) ఉన్నట్టుగా తేలింది. తరచుగా ప్రమాదాల బారిన పడుతున్న  వారి జాబితాలో టూవీలర్‌పై ప్రయాణించే వారు, పాదచారులు ఉండటంతో ఇవి జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ప్రస్తుతం దృష్టిని కేంద్రీకరించాల్సి ఉంది. రోడ్డుపై ప్రయాణించే వారి భద్రత, పరిరక్షణకు కఠినంగా నిబంధనల అమలు, తగిన మౌలిక సదుపాయాల కల్పన, ఏవైనా ప్రమాదాలు జరిగినపుడు వెంటనే వైద్య, ఆరోగ్యపరంగా ఆదుకునేలా వివిధ రకాల సేవలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఈ అధ్యయనం నొక్కి చెప్పింది. 

సర్వేలో వెల్లడైన ముఖ్యాంశాలు
► రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నవారిలో 34శాతం పేదలు ఎలాంటి ఆదాయం లేనివారే  
► 28 శాతం మంది మృతులు నెలకు రూ.10–20 వేల మధ్యలో సంపాదిస్తున్నవారు 
► చనిపోయిన వారిలో 3 శాతం మంది మాత్రమే నెలకు రూ.50 వేలకు పైగా ఆదాయం ఉన్నవారు 
► మృతుల్లో 67 శాతం మంది 18 నుంచి 45 ఏళ్ల మధ్యలోని వారు (కుటుంబ పోషకులు, సంపాదనాపరులు) 
► ప్రమాదాల్లో మృతిచెందిన ద్విచక్ర వాహనదారులు 40 శాతం, పాదచారులు 39 శాతం, కార్లు, ట్యాక్సీలు, ఎస్‌యూవీల్లోని వారు 8.8 శాతం 
► ప్రమాదాలు సంభవించిన 7 శాతం కేసుల్లో అక్కడికక్కడే మరణాలకు కారణమవుతుండగా, 66 శాతం తీవ్ర గాయాల పాలవుతున్నారు 
► రోడ్డు ప్రమాదాలకు గురయ్యాక ఆసుపత్రుల్లో చేర్చిన మృతుల్లో 59 శాతం మంది టూవీలర్‌ నడిపేవారు, 15.5 శాతం పాదచారులు 

మరిన్ని వార్తలు