క్లిక్‌ అయిన ‘ఉమెన్‌ క్లినిక్‌’ 

31 Mar, 2023 04:32 IST|Sakshi

ఇప్పటివరకు19 వేల మందికిపైగా స్క్రీనింగ్‌ 

28న రికార్డు స్థాయిలో7,965 మందికి పరీక్షలు 

100 ‘ఉమెన్‌ స్పెషల్‌ క్లినిక్‌’ల్లో పరీక్షలు.. ప్రతి మంగళవారంనిర్వహిస్తున్న సర్కారు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టిన ఉమెన్‌ స్పెషల్‌ క్లినిక్‌లు క్లిక్‌ అయ్యాయి. రాష్ట్రంలోని మహిళలంతా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’కార్యక్రమానికి విశేషస్పందన లభిస్తోంది. ప్రతి మంగళవారం మహిళలకు మాత్రమే వైద్యపరీక్షలు జరిపేందుకు రాష్ట్రవ్యాప్తంగా వంద ‘ఉమెన్‌ స్పెషల్‌ క్లినిక్స్‌’ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గత మూడు మంగళవారాల్లో మొత్తం 19 వేల మందికిపైగా మహిళలకు వైద్యపరీక్షలు జరిగాయి.

‘మహిళ ఆరోగ్యం– ఇంటి సౌభాగ్యం’అనే లక్ష్యంతో ఈ వైద్యకేంద్రాల్లో మహిళలకు సంబంధించిన 8 ప్రధా న ఆరోగ్య సమస్యలకు పరీక్షలు చేసి, చికిత్స అందిస్తున్నారు. మహిళలు తీరిక లేకనో, భయం కారణంగానో, సరైన అవగాహన లేకనో, సొంతంగా ఆసు పత్రికి వెళ్లలేకనో, ఇతర కారణాలతోనో తమ అనారోగ్య సమస్యలను ఎవరికీ చెప్పుకోలేకపోవడతో వారి ఆరోగ్య సమస్యలు ముదిరి, పెద్ద వ్యాధులకు దారితీస్తున్నాయి. ఇలాంటివారికి ‘ఆరోగ్య మహిళ’కార్యక్రమం కొండంత భరోసా ఇస్తోంది.  

క్రమంగా పెరుగుతున్న ఆదరణ  
ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఈ నెల 8న రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు కరీంనగర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 14వ తేదీ నుంచి క్లినిక్‌లలో ఆరోగ్యపరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటివారం 4,793 మంది మహిళలు పరీక్షలు చేయించుకున్నారు.

రెండోవారం 6,328 మంది మహిళలు క్లినిక్‌లకు వచ్చారు. ఓపీ 32 శాతం పెరిగింది. 28న 7,965 మందికి స్క్రీనింగ్‌ నిర్వహించారు. అంతకుముందు వారంతో పోల్చితే 26 శాతం మంది అధికంగా రికార్డుస్థాయిలో క్లినిక్‌లకు వచ్చారు. మొదటివారం 2,723 నమూనాలు, రెండోవారం 2,792, మూడోవారం 4,727 నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌కు పంపారు. ఫలితాలు 24 గంటల్లోనే సంబంధిత మహిళలకు అందుతున్నాయి.  

సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి హరీశ్‌ 
మహిళల సంపూర్ణ ఆరోగ్యం కోసం అమలు చేస్తున్న ‘ఆరోగ్య మహిళ’ను ప్రతి ఒక్కరూ స ద్వినియోగం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్న 8 రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు.

మరిన్ని వార్తలు