8 లక్షల మంది చదువులకు దూరం 

13 Aug, 2021 03:26 IST|Sakshi

ఆన్‌లైన్‌ పాఠాలు అందక ప్రభుత్వ విద్యార్థుల అవస్థలు 

ప్రత్యక్ష బోధనవైపు అడుగులు వేస్తున్న ఇతర రాష్ట్రాలు 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు చదువులకు దూరం అవుతున్నారు. కరోనా కారణంగా ప్రత్యక్ష విద్యా బోధన లేకుండానే గత విద్యా సంవత్సరం గడిచిపోగా.. ఈసారి విద్యా సంవత్సరం మొదలై నెల దాటినా అదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యాశాఖ తేల్చిన అధికారిక లెక్కల ప్రకారమే.. 72 వేల మంది విద్యార్థులకు టీవీ, కంప్యూటర్, స్మార్ట్‌ ఫోన్‌ వంటివేవీ లేవు. ఈ సదుపాయం ఉన్నా వివిధ సమస్యల కారణంగా మరో 4 లక్షల మంది పాఠాలు వినడం లేదు. ఒకటి రెండు తరగతుల విద్యార్థులు 3 లక్షల మందికి ఎలాంటి తరగతులూ నిర్వహించడం లేదు. 

ఏదో ఒక సమస్యతో.. 
రాష్ట్రంలో గురుకులాలు మినహా 27,257 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 18,43,589 మంది చదువుతున్నారు. కరోనా కారణంగా బడులు తెరవకపోవడంతో విద్యాశాఖ డిజిటల్‌ బోధన ప్రారంభించింది. రాష్ట్ర సాంకేతిక విద్యా సంస్థ (సైట్‌) గతేడాది రూపొందించిన వీడియో పాఠాలనే టీ–శాట్, దూరదర్శన్‌ (యాదగిరి) చానెళ్ల ద్వారా ప్రసారం చేస్తోంది. ఇదికూడా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మాత్రమే. ఒకటో, రెండో తరగతి విద్యార్థుల విషయాన్నే పక్కన పెట్టేసింది. దీంతో 3 లక్షల మంది చదువుకు దూరమయ్యారు. 

3–10వ తరగతి వరకు ఉన్న విద్యార్థుల్లో 1,00,459 మం దికి డిజిటల్‌ పాఠాలు వినేందుకు అవసరమైన టీవీలు లేవు. ఇందులో సుమారు 27,257 మందికి గ్రామ పంచాయతీల్లో టీవీ చూసే ఏర్పాటు చేసింది. ఇందులోనూ 10 వేల మంది మాత్రమే హాజరవుతున్నారు. అంటే మిగతా 90 వేల మంది చదువులకు దూరమయ్యారు.  

ఇక ఇంటర్నెట్‌ సదుపాయం లేక, టీవీలో పాఠాలు ఎప్పుడు వస్తాయో తెలియక, ఆన్‌లైన్‌ క్లాసులు అర్థంకాక మరో 4 లక్షల మంది పాఠాలు వినడం లేదని అంచనా. 

మరోవైపు ఇప్పటికే ఏపీ, యూపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు స్కూళ్లలో ప్రత్యక్ష బోధనపై నిర్ణయం తీసుకున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా చర్యలు చేపట్టాయి. మన రాష్ట్రంలోనూ ప్రత్యక్ష బోధన చేపట్టాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.  

మరిన్ని వార్తలు