84శాతం రోగులకు ఇళ్లలోనే చికిత్స

3 Aug, 2020 01:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలో కరోనా సోకిన వారిలో లక్షణాలు లేని 84 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ చికిత్స పొందుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. లక్షణాలు కనిపించిన మిగిలిన 16 % మంది మాత్రమే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు ఆదివారం ఉదయం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించారు. ఆ ప్రకారం శనివారం (ఒకటిన) కొత్తగా 1,891 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది. ఒకేరోజు 10 మంది మరణించడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 540కి పెరిగింది.

తాజాగా 1,088 మంది కోలుకోగా... ఇప్పటి వరకు డిశ్చార్జి అయిన వారి సంఖ్య 47,590కి చేరింది. ప్రస్తుతం 18,547 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఒకేరోజు 19,202 శాంపిళ్లు సేకరించి పరీక్షలు చేసినట్లు తెలిపారు. ఇక తాజాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 517, రంగారెడ్డి జిల్లాలో 181, మేడ్చల్‌ జిల్లాలో 146, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 138, నిజామాబాద్‌ జిల్లాలో 131, సంగారెడ్డిలో 111 కేసులు నమోదయ్యాయి. భూపాలపల్లి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని శ్రీనివాసరావు తెలిపారు. నాగర్‌కర్నూలు జిల్లాలో ఒకటి, కొమురంభీంలో రెండు కేసులు నమోదయ్యాయి. 57 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 8,446 పడకలు ఉండగా, వాటిల్లో 6,049 పడకలు ఖాళీగా ఉన్నాయి. ఇక 94 ప్రైవేట్, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మొత్తం 6,569 పడకలుండగా, వాటిల్లో 2,420 ఖాళీగా ఉన్నాయని బులిటెన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రకారం అవసరమైన బాధితులు ఆసుపత్రులకు వెళ్లొచ్చని ప్రభుత్వం తెలిపింది.    

మరిన్ని వార్తలు